సిద్దిపేట జిల్లాలో శిశు విక్రయం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మహిళకు 15రోజుల క్రితం ఆడ శిశువు జన్మించింది. కుటుంబ పోషణ భారం అవుతోందని పుట్టిన 5 రోజులకే ఆ పాపను మరొకరికి విక్రయించారు. శిశువుకు టీకా వేయడానికి వైద్య సిబ్బంది వారి ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ పసికందు లేకపోవడం.. తల్లిదండ్రులు సరైన సమాధానం చెప్పకపోవడంతో వారికి అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు స్పందించి గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు.
నలుగురు సంతానంతో పాటు ఆడశిశువు కావటంతో కుటుంబాన్ని పోషించడం కష్టం అవుతుందనే ఉద్దేశంతో బిడ్డను ఇష్టపూర్వకంగానే తన బంధువులకు ఇచ్చానని తల్లి అంగీకరించింది. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన వారికి విక్రయించినట్లు గుర్తించిన అధికారులు.. వెంటనే పాపను తీసుకువచ్చి అప్పగించాలని వారికి ఫోను ద్వారా సమాచారం ఇచ్చారు. పోషణకు ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, బిడ్డను వేరొకరికి అప్పగించడం చట్టరీత్యా నేరమని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఇదీ చదవండి: నడివయసులో చుట్టుముడుతున్న వ్యాధులు