సిద్దిపేట మున్సిపాలిటీ కార్యాలయంలో ఛైర్మన్ రాజనర్సు అధ్యక్షతన పట్టణ అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ ఆదాయం పెంచే దిశగా మున్సిపల్ అధికారులు ఆలోచన చేయాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సిద్ధిపేటలో పట్టణ పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగ్గా జరిగేలా మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు. పట్టణంలో యూజీడీ పనులు వేగవంతం చేయాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య, విద్యుత్ సరఫరా కార్మికుల పనితీరుపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని అధికారులకు చెప్పారు
మున్సిపాలిటీలోని తాగునీటి, పారిశుద్ధ్య, విద్యుత్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో కేవలం 60 శాతం మాత్రమే పని జరుగుతున్నదని తెలిపారు. మిగిలిన 40 శాతం ఉద్యోగుల సేవలు కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే.. సిద్దిపేట అద్దంలా తయారవుతుందని అభిప్రాయపడ్డారు.
మున్సిపాలిటీ పన్ను వసూళ్లపై ఇండస్ట్రీయల్, కమర్షియల్, రెసిడెన్షియల్ జోన్ల అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో మంత్రి ఈటల పర్యటన