ETV Bharat / state

పరిహాసంగా మారుతున్న పునరావాసం.. బాధితుల ధైన్య స్థితి - telangana latest news

పునరావాస కల్పనపై అధికారులు చెబుతున్న మాటలకు.. క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరటం లేదు. ఫలితంగా సర్వం కోల్పోయి.. పునారావాస కాలనీలకు వస్తున్న నిర్వాసితులకు న్యాయం జరగడం లేదు. రోజుకో కొత్తసమస్యతో అవస్థలు పడుతున్నారు.

malla sagar
malla sagar
author img

By

Published : Aug 26, 2021, 8:05 AM IST

మల్లన్నసాగర్‌ ముంపు గ్రామాల్లో ఒకటైన ఏటిగడ్డ కిష్టాపూర్‌ వాసి జి.తిరుపతికి గజ్వేల్‌ పట్టణం సంగాపూర్‌లో నిర్మించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో కేటాయించిన ఇల్లు ఇది. గృహప్రవేశం చేసిన నాలుగు నెలలకే కూలే దశకు చేరింది. భయంతో ఇల్లు ఖాళీచేసిన బాధితుడు తమ్ముడింట తలదాచుకుంటూ సొంతింటికి మరమ్మతు చేసుకుంటున్నారు. కూలిపోయిన ఇంటిగోడను తిరిగి నిర్మించుకున్నారు. ఈ కాలనీలో సగానికిపైగా ఇళ్లు చిన్న వానకే కురుస్తున్నాయి. మరుగుదొడ్లు కుంగిపోయాయి. ఇంటింటికీ ఇలా ఏదో ఒక సమస్య ఉందని బాధితులు వాపోతున్నారు.

తరతరాల వారసత్వంగా వస్తున్న ఆవాస ప్రాంతాల్ని ప్రాజెక్టుల నిర్మాణాలకు అప్పగిస్తున్న బాధితులకు.. చెప్పిన మేరకు న్యాయం చేకూరడం లేదు. ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న పునరావాస కాలనీల్లో సౌకర్యాలు పూర్తిగా ఏర్పాటు కాకపోవడం, నిర్మించిన ఇళ్లూ నాణ్యంగా లేకపోవటంతో తరలివచ్చిన బాధితులు కష్టాలు అనుభవిస్తున్నారు. ప్రధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మల్లన్నసాగర్‌, బీమా ఎత్తిపోతల్లోని శంకరపల్లి.. నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని చిన్నోనిపల్లి, సంగబండ జలాశయం కింద రెండు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల్లో జలాశయాల కిందా ఇలాంటి పరిస్థితే ఉంది.

త్యాగధనుల అవస్థలు
పుట్టిపెరిగిన నేల, దానితో ముడిపడిన అనుబంధాలు, ఇళ్లు, పశుసంపదకు అనువైన వాతావరణం.. అలాంటి గ్రామం ఖాళీ చేయడానికి మనసు ఒప్పకున్నా పునరావాసానికి తరలివస్తున్నారు బాధితులు. నివాస యోగ్యమైన నిర్మాణాలు, వసతులు కల్పించాలనేది వారి కోరిక.. కానీ, పునరావాస కల్పనపై అధికారులు చెబుతున్న దానికీ.. క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన కుదరటం లేదు. ప్రజలు గ్రామాలు ఖాళీచేస్తే చాలన్నట్లు అధికారులు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలను అమలుచేస్తున్నారు. కాలనీల్లో కనీస వసతులు కల్పించడం లేదు. కొత్త ఇళ్లలో చేరాక బాధితులే ఒక్కోటీ చక్కబెట్టుకోవాల్సిన దైన్యస్థితి.. కొన్ని ప్రాజెక్టుల కింద పునరావాసం అపహాస్యమవుతోంది. ఎప్పుడు ప్యాకేజీ ఇస్తారో, ఇళ్ల నిర్మాణం చేపట్టేది ఎన్నడో చెప్పేవారూ లేరు.

వాస్తవ పరిస్థితి ఇదీ...

* సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్‌ కింద 16 గ్రామాలు ముంపులో పోతున్నాయి. ఇక్కడి ప్రజలకు గజ్వేల్‌ పురపాలిక పరిధిలో 2200 గృహాలు నిర్మించి ఇచ్చారు. 250 గజాల స్థలం, రెండు పడక గదుల ఇళ్లు కట్టించి ఇవ్వగా నాలుగు నెలల క్రితమే బాధితులు వచ్చి చేరారు. ఇటీవలి వర్షాలకు ఇళ్లన్నీ కురిశాయి. కొన్ని గోడలు కూలిపోయాయి. సొంత ఖర్చులతో మరమ్మతులు చేసుకుంటున్నారు. గోడలకు చెమ్మ దిగి విద్యుత్‌ షాక్‌ వస్తోందని బాధితులు వాపోతున్నారు.
* నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో సంగంబండ జలాశయం ముంపు గ్రామాలైన నేరుడుగాం, సంగంబండ ప్రజలూ పునరావాసం కోసం ఎదురుచూస్తున్నారు. జలాశయం కట్టకు 200 మీటర్ల సమీపంలోనే నేరుడుగాం ఉండటంతో ఇళ్లకు చెమ్మపడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో నెట్టెంపాడు ఎత్తిపోతల్లోని చిన్నోనిపల్లి జలాశయం ముంపు గ్రామం చిన్నోనిపల్లి పునరావాసం కూడా నేటికీ పూర్తికాలేదు. పదేళ్ల క్రితం ఇచ్చిన పరిహారంతో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని, ప్రభుత్వం మెరుగైన చెల్లింపులు చేయాలని కోరుతున్నారు.
* అసంపూర్తి ఇళ్లతో కనిపిస్తున్న ఈ ఊరి పేరు కానేయపల్లి. వనపర్తి జిల్లాలో భీమా రెండోదశ ఎత్తిపోతల పథకంలోని శంకరపల్లి జలాశయం ముంపు గ్రామమిది. 1280 కుటుంబాలు ఉన్నాయి. పునరావాసం కింద సరైన న్యాయం జరగలేదంటూ గ్రామాన్ని బాధితులు ఖాళీచేయడం లేదు. ఆర్‌ అండ్‌ ఆర్‌కు కేటాయించిన ప్రాంతంలో స్థలాలు కేటాయింపు మాత్రమే జరిగింది. పదేళ్లుగా గ్రామంలో ఎవరూ కొత్త ఇళ్లు కట్టింది లేదు. ఉన్నవాటికి మరమ్మతులూ చేసుకోవడం లేదు. రెండు పడకగదుల గృహాలు కట్టించి ఇవ్వాలనేది వారి డిమాండు.

.

ఇదీచూడండి: 1న కేఆర్‌ఎంబీ భేటీకి తెలంగాణ హాజరు... అధికారులకు సీఎం దిశానిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.