Land occupations: రూ.వందల కోట్ల విలువైన భూముల్లో చోటుచేసుకున్న అవకతవకలు ఒకవైపు ఉండగానే.. క్షేత్రస్థాయిలో భూముల హద్దులు చెరిపే యత్నాలకు తెరతీస్తున్నారు ఆక్రమణదారులు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లోని మిగులు, అసైన్డ్ భూముల్లో తాజాగా మరికొన్ని లొసుగులు వెలుగుచూశాయి. 161 సర్వే నంబరు ఉపసంఖ్యల్లోని దళితులకు చెందిన కొంత భూమిని ఆక్రమించిన దళారీలు.. రెవెన్యూ దస్త్రాల్లో పేర్ల మార్పిడికి ప్రయత్నాలు చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరణి ప్రారంభం సందర్భంగా గ్రామంలో లేనివారి పేర్లను సైతం దస్త్రాల్లో నిక్షిప్తమయ్యేలా చేశారన్నది వాటిని పరిశీలిస్తే ఇట్టే తెలిసిపోతుంది.
అడ్డుచెప్పేవారు లేరనే..: 1977, 1991 సంవత్సరాల్లో ప్రభుత్వం క్షీరసాగర్ (చీలసాగర్) పరిధిలోని 161, 139 సర్వే నంబర్లలోని మిగులు, అసైన్డ్ భూములను ఇక్కడి దళిత పేదలకు కేటాయించింది. 161లో 39.27 ఎకరాల గైరాన్ భూములు కూడా ఉన్నాయి. 139లో 68 ఎకరాల సీలింగ్ భూమి ఉంది. రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు జరగకుండా 22-ఎ జాబితాలోనూ ఈ భూములను చేర్చారు. అయినప్పటికీ కొన్ని భూములకు సంబంధించి ధరణిలో పేర్లు మారిపోయాయి. 22-ఎలో ఉన్న భూముల యాజమాన్య హక్కుల మార్పిడీ చేయాలంటే తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ జారీచేసే నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) ఉండాలి. ఇదేమీ లేకుండానే యాజమాన్య హక్కులు మార్పిడీ జరుగుతున్న తీరుపై బాధితులు వాపోతున్నారు. పైగా అక్రమంగా కంచె వేసి అటువైపు వెళ్లకుండా అడ్డుకుంటుండటం వెనుక తెరచాటున దస్త్రాల్లో మార్పులు చేస్తున్నారేమోనని బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
భూముల సర్వే చేస్తే గుట్టురట్టు.. : క్షీరసాగర్ పరిధిలోని మిగులు, ప్రభుత్వ భూములపై ఇప్పటికే బాధితులు ధరణిపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షుడు హరీశ్‌రావుకు, సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 161 సర్వే నంబరులో దళితులకు అప్పగించిన, ప్రభుత్వ భూములకు సంబంధించి సర్వే చేసి యాజమాన్య హక్కులపై స్పష్టత తీసుకురావాల్సిన అవసరం ఉంది. గ్రామ పరిధిలో ఉన్న రూ.కోట్ల విలువ చేసే మిగులు భూములపై స్పష్టత తెస్తే నిరుపేదలకు పంపిణీ చేయడానికి, ప్రభుత్వానికి ఆదాయ వనరుగానైనా ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న సమగ్ర సర్వేను పైలెట్ ప్రోగ్రాం కింద క్షీరసాగర్‌లో నిర్వహిస్తే దళితుల హక్కులను కాపాడినట్లు అవుతుంది. సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో నమూనా సర్వే చేస్తే సమగ్ర డిజిటల్ సర్వే నిర్వహణకు ముందుగానే ఎదురయ్యే సవాళ్లను గుర్తించినట్లు అవుతుందని భూ చట్టాల నిపుణులు సూచిస్తున్నారు.
‘‘ధరణిలో నల్ల కుమార్ పేరుతో 1.15 ఎకరాల అసైన్డ్ భూమిని చూపుతున్న చిత్రం ఇది. ఈ పేరున్న వారెవరూ అసైన్డ్ భూములు పొందలేదని, తమ గ్రామంలో నల్ల ఇంటిపేరుతో వేరే వారు ఉండగా కొందరికి సంబంధించిన భూములు ఇప్పటికీ ధరణిలో నమోదు కాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా గ్రామానికి చెందనివారి పేర్లతో అసైన్డ్ భూములు నమోదయ్యాయని పేర్కొంటున్నారు’’
ఇవీ చదవండి: Finance department on debits: అప్పులపై ఆంక్షలు సడలించండి.. కేంద్రానికి రాష్ట్ర ఆర్థికశాఖ లేఖ
karnataka Paddy seize: భారీగా వరి ధాన్యం సీజ్.. 16 లారీలు పట్టివేత
ఫేస్బుక్లో లవ్.. కులం వేరని పెళ్లికి నో.. గొడవపడి గొంతు కోసుకున్న ప్రేమికులు