తమ ఆదేశాలను ధిక్కరిస్తారా అంటూ అధికారులపై మండిపడింది హైకోర్టు. ఇద్దరు అధికారులకు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. ఇకపై ఎవరూ కూడా కోర్టు ఆదేశాలను ధిక్కరిచ్చొద్దన్న రీతిలో స్పందించింది న్యాయస్థానం.
అసలేమైందంటే...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం అధికారులు భూసేకరణ చేపట్టారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిప్పారం గ్రామంలోని తమ భూములను ప్రభుత్వం చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకుంటున్నదని గతంలో కొందరు స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. పరిహారం పునరావాసం తదితర చట్టపరమైన ప్రయోజనాలు కల్పించే వరకు భూములు స్వాధీనం చేసుకోవద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
జైలు శిక్ష
న్యాయ స్థానం ఆదేశాలను ఉల్లంఘించి అధికారులు తమ భూముల్లోని మామిడి తోటలు ధ్వంసం చేసి బలవంతంగా లాక్కున్నారని ముగ్గురు రైతులు మళ్లీ న్యాయస్థానం తలుపుతట్టారు. కోర్టుధిక్కరణ వ్యాజ్యం కింద విచారణ చేపట్టిన ధర్మాసనం గజ్వేల్ ఆర్డీవో విజయేందర్ రెడ్డి, కొండపాక తహసీల్దార్ ప్రభుకు రెండు నెలల జైలు శిక్ష, రూ. 2వేల విధిస్తూ తీర్పు వెలువరించింది. అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా తీర్పును ఆరు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
ఇదీ చదవండిః గాంధీ 150: మహాత్ముని జీవనమే సంస్కరణ