మల్లన్నసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో ముగ్గురు అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ మూడు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది.
అసలేం జరిగిందంటే...
పునరావాసం కల్పించకుండా మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్‌కు చెందిన సుమారు 70 మంది వ్యవసాయ కార్మికులు గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చట్టం ప్రకారం పునరావాసం కల్పించకుండా పనులు చేపట్టొద్దంటూ హైకోర్టు గతేడాది జులై 25న ఆదేశించింది. ప్రాజెక్టు వివరాలు సమర్పించాలని, పిటీషనర్ల అభ్యంతరాలను మరోసారి స్వీకరించి తుది నిర్ణయం ప్రకటించాలని స్పష్టం చేసింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి ప్రాజెక్టు పనులు చేస్తున్నారంటూ మరోసారి వేములఘాట్‌కు చెందిన 17 మంది ధిక్కరణ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం కాళేశ్వరం ప్రాజెక్టు మూడో యూనిట్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌గా వ్యవహరిస్తున్న సిద్దిపేట ఆర్డీవో జయచంద్రరెడ్డి, తొగుట తహసీల్దార్ వీర్‌సింగ్, నీటి పారుదల శాఖ గజ్వేల్ డివిజన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ టీ వేణు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, న్యాయస్థానానికి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది.
బాధితుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం... ఈ ముగ్గురు అధికారులకు మూడు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అప్పీలుకు వెళ్లేందుకు తీర్పును ఆరు వారాల పాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చూడండి: కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ట్రయల్ రన్