కాకితో కబురు పంపినా ఆర్టీసీ కార్మికులు చర్చలకు సిద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ సమ్మెలో భాగంగా కార్మికులు డిపో నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన ర్యాలీలో చాడ పాల్గొన్నారు. చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ... చౌరస్తాలోని పలు దుకాణాలలో భిక్షాటన చేశారు. వచ్చిన డబ్బులను కార్మికులకు అందించారు. ఈరోజు చనిపోయిన కార్మికుడికి నివాళులర్పించారు. 28 మంది కార్మికులు చనిపోయినా... సీఎం కేసీఆర్‌కు కనికరం లేదని చాడ మండిపడ్డారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 48 వేల కుటుంబాలు బజారున పడ్డాయన్నారు. కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నా... పట్టించుకోని సీఎం దేశంలో ఎవరూ లేరన్నారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు సమ్మెలో ఉద్ధృతంగా పాల్గొంటామని చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'