రైతులకు చెరుకు బిల్లులు చెల్లించని ట్రైడెంట్ చక్కెర కర్మాగారం వేలానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు(బి)లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారానికి రైతులు చెరుకు, గానుగకు తరలించి ఏడాదిన్నర కావస్తున్నా.. రూ.12 కోట్ల మేర బకాయిలు చెల్లించలేదు.
ఈ విషయమై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ చక్కెర అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో పలుమార్లు చర్చలు జరిపారు. కానీ.. కర్మాగారం యాజమాన్యం రేపు మాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది. గత ఆరు నెలలుగా మూడు గడువులు విధించినా.. బిల్లు బకాయిలు చెల్లించకపోవడంతో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి కర్మాగార ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ప్రశాంత్ కుమార్ నేతృత్వంలోని బృందం యంత్ర సామాగ్రి, కర్మాగారం ఆస్తుల వివరాల అంచనాలను రూపొందించారు. మే రెండో వారంలో కర్మాగారాన్ని వేలం వేసి చెరుకు బిల్లు బకాయిలను రైతులకు చెల్లించేందుకు సన్నద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. వేలం వేసేందుకు అధికారులు వచ్చారని తెలుసుకున్న చెరుకు రైతులు కర్మాగారం వద్దకు వచ్చి.. బకాయి బిల్లులను చెల్లించేలా చర్యలు చేపట్టి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: సీజేఐ నియామకంపై కర్ణాటక హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హర్షం