sugarcane farmers Problems: చెరుకు రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. పంట పండించింది మొదలు.. గానుగకు తరలించే వరకు ఇబ్బందులు తప్పడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడులు వచ్చినా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక నష్టాలపాలవుతున్నారు. ఒప్పందం మేరకు కర్మాగారం గానుగ ప్రారంభించక పోవడంతో.... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రైతులు కర్ణాటక ఫ్యాక్టరీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆనందం అంతలోనే ఆవిరి..
zaheerabad sugarcane farmers: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు ప్రసిద్ధి. పండించిన చెరుకును జహీరాబాద్ మండలం కొత్తూరు(బి) ట్రైడెంట్ కర్మాగారానికి తరలిస్తారు. యాజమాన్యం ప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో గడచిన రెండేళ్లుగా... గానుగ ప్రారంభించలేదు. ఈఏడాది... రైతులు పోరాటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 5న గానుగ ప్రారంభమైంది. యంత్రాల్లో సమస్య తలెత్తి రెండు రోజులకే మళ్లీ గానుగ నిలిచిపోయింది. చేసేదిలేక జహీరాబాద్ పరిసరాల రైతులు సమీపంలోని కర్ణాటక బాల్కిలోని బాలీకేశ్వర్ కర్మాగారానికి చెరుకును తరలిస్తున్నారు.
trident sugar factory: కొత్తూరు ట్రైడెంట్ చక్కెర కర్మాగారానికి జహీరాబాద్, ఆందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాలతో పాటు వికారాబాద్ జిల్లాలోని తొరమామిడి ప్రాంత రైతులు చెరుకును తరలిస్తారు. మూడు నియోజకవర్గాల్లో దాదాపుగా 20 వేల ఎకరాల్లో తొమ్మిది లక్షల టన్నుల వరకు చెరుకు సాగవుతోంది. ఎకరా సాగుకు 20 నుంచి 30 వేల ఖర్చు చేయాల్సి వస్తోంది. పంట సాగుకు ముందే... కర్మాగారం వద్ద రైతులు కోత, రవాణా, గానుగ కోసం ఒప్పందం చేసుకుంటారు. అయితే పంట చేతికందే సమయానికి కర్మాగారం గానుగ ప్రారంభించక పోవడంతోనే అసలు సమస్య మొదలవుతోంది.
బతిమాలుకుంటున్న రైతులు
చేసేది లేక పోవడంతో రైతులు కర్ణాటకలోని బాల్కీ, గుల్బర్గాలోని చక్కెర కర్మాగారాల యజమాన్యాలను రైతులు బతిమిలాడుకుంటున్నారు. అక్కడి కర్మాగారాలు టన్నుకు రెండువేల రెండు వందలు చొప్పున ఇస్తుండడంతో రాష్ట్రం ధరతో పోలిస్తే టన్నుకుకు వెయ్యి రూపాయల వరకు నష్టం వాటిల్లుతోంది.
'స్థానికంగా ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ నడవకపోవడం వల్ల మా పంటను కర్ణాటకకు తరలిస్తున్నాము. ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. మేము రెండేళ్ల క్రితం అమ్మిన పంటకు బిల్లులు రాలేదు. బాల్కీ ఫ్యాక్టరీ వాళ్లు టన్నుకు రూ.2,200 వరకు చెల్లిస్తామని చెప్పారు. దిగుబడి బాగున్నా ధర లేకపోవడం వల్ల నష్టపోతున్నాం.' -చంద్రశేఖర్ రెడ్డి, రైతు, చిరాగ్ పల్లి
మళ్లీ అక్కడికే తరలింపు
జహీరాబాద్ ట్రైడెంట్ చక్కెర కర్మాగారం టన్నుకు 3వేలు చెల్లిస్తామని ప్రకటించడంతో చెరుకు రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. గానుగ ప్రారంభించిన రెండు రోజుల్లోనే కర్మాగారం మళ్లీ మూతపడడంతో ఆందోళన మొదలైంది. జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు చేదోడుగా నిలుస్తున్న కర్ణాటకలోని బాల్కి బాల్ కేశ్వర్ కర్మాగారం కూలీలతో కాకుండా యంత్రాన్ని వినియోగిస్తోంది.
సమస్యపై శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం దృష్టిసారించకపోతే... చెరుకు సాగును వదిలేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయని రైతులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: Farmer Family Protest at Both: 'మా భూమి మాకివ్వండి... లేదంటే చావే దిక్కు'