లాక్డౌన్ వేళ పరిశ్రమల్లో వరస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అర్జున్నాయక్ తండాలోని బయో డీజిల్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇద్దరు వెల్డర్లు దుర్మరణం పాలయ్యారు. స్కంద ఫ్యూయల్స్ బయో డీజిల్ పరిశ్రమలో ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. రియాక్టర్ పైకప్పు ఒక్కసారిగా ఎగిరిపడింది. ఇద్దరు కార్మికులు గాల్లో ఎగిరి కిందపడి... ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను జహీరాబాద్ డ్రైవర్స్ కాలనీకి చెందిన సాబీర్, గౌసుద్దీన్గా గుర్తించారు.
మృతుల కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. బాధితుల్ని ఆదుకోవాలని పరిశ్రమ ఎదుట బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దుర్ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు.