Patha Pantala Jathara in Sangareddy : చిరుధాన్యాల ప్రాముఖ్యత.. సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు రైతులకు వివరించి.. సాగు చేసే విధంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా గత 23 సంవత్సరాలుగా ఏటా సంక్రాంతి సందర్భంగా పాత పంటల జాతర నిర్వహిస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే జాతరను ఒక్కో రోజు.. ఒక్కో గ్రామంలో నిర్వహిస్తారు. 80 రకాలకు పైగా చిరుధాన్యాల ప్రదర్శన, ఆదర్శ రైతుల సన్మానం ఇలా.. సేంద్రీయ విధానంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ జాతర సాగుతుంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ప్రిన్సిపల్, శాస్త్రవేత్త సంజనా రెడ్డి విత్తన బండ్లకు పూజలు చేసి ప్రారంభించారు. విత్తనాలతో అలంకరించిన బండ్లు.. రైతుల జానపద నృత్యాలు, పాటలతో సందడిగా 23వ పాత పంటల జాతర మొదలైంది.
విత్తనాల్లో దేవుడిని భావించుకుని జాతర చేస్తున్నాం : సాధారణంగా దేవుని పేరుతో జాతరలు నిర్వహిస్తారు. పాత పంటల జాతరలో మాత్రం విత్తనాల్లో దేవుడిని భావించుకుని జాతర చేస్తున్నామని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ డైరెక్టర్ సతీశ్ పేర్కొన్నారు. ఒకటి.. రెండు సంవత్సరాల్లో ఆగిపోతుందని భావించిన ఈ పాత పంటల జాతర నిర్విరామంగా 23వ సంవత్సరం జరుగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఏటికేడు కొత్త గ్రామాలకు డీడీఎస్ విస్తరిస్తోంది. కొత్తవారికి కొంచెం ప్రోత్సాహం ఇస్తే ఉత్సాహంగా ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతున్నారని సతీశ్ హర్షం వ్యక్తం చేశారు.
ఆ రెండు సమస్యలకు పరిష్కారం చిరుధాన్యాలే : ఆహార ధాన్యాల కొరతను అధిగమించడానికి చేపట్టిన హరిత విప్లవం వల్ల ఆహార భద్రత సాధించాం కానీ.. పౌష్టికాహార లోపం సమస్య మాత్రం పెరిగిందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ప్రిన్సిపల్, శాస్త్రవేత్త సంజనా రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్తులో వాతావరణ మార్పు పెద్ద సమస్యగా మారనుందని.. ఈ రెండు సమస్యలకు పరిష్కారం చిరుధాన్యాలే అని ఆమె స్పష్టం చేశారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునే వారు ఆరోగ్యంగా ఉంటున్నారని.. కరోనా తీవ్రత కూడా వీరిలో తక్కువగా ఉందని సంజనా రెడ్డి తెలిపారు. సేంద్రీయ విధానంలో చిరుధాన్యాలు సాగు చేస్తూ.. సొంత విత్తనాలనే వాడుతూ సార్వభౌమత్వాన్ని సాధించిన ఈ స్ఫూర్తిని ఇలానే కొనసాగించాలని ఆమె సూచించారు.
రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేలా జాతరలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. రసాయనాలు లేకుండా విత్తనాలు భద్రపరుచుకునే విధానం, సేంద్రీయ ఎరువుల తయారీ, భూసార పరీక్ష కోసం మట్టి సేకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వందలాది రకాల ధాన్యాలు, వివిధ రకాల నేలలు, సేంద్రీయ ఎరువులు, చిరు ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు ప్రదర్శనగా ఉంచారు.
ప్రపంచంలోనే అతిపెద్ద జీవ వైవిధ్య జాతర : పాత పంటల జాతరలో విదేశాలకు చెందిన వారు పాల్గొన్నారు. సేంద్రీయ విధానంలో చిరుధాన్యాల సాగు, మహిళాభ్యున్నతి వంటి అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఇక్కడికి వచ్చామని చెబుతున్నారు. విత్తనాలను దైవంగా భావించి జాతర చేయడం.. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు బాగున్నాయని విదేశీయులు తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంచార జీవ వైవిధ్య జాతరగా గుర్తింపు తెచ్చుకున్న ఈ పాతపంటల జాతర నెల రోజుల పాటు రోజుకో ఊరిలో జరగనుంది.
ఇవీ చదవండి: