నియంత్రిత సాగు విధానం ద్వారా సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకుని వచ్చారని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో రైతు కమిటీ సమావేశం నిర్వహించారు. నియంత్రిత వ్యవసాయ సాగు విధానం ద్వారా ప్రతి గ్రామంలో వ్యవసాయ విస్తీర్ణ సాగు పెరిగిందని ఎమ్మెల్యే అన్నారు.
నియోజకవర్గంలో కూరగాయల సాగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్కు శివారు ప్రాంతంగా ఉన్న పటాన్చెరు నియోజకవర్గంలో ఉద్యానవన పంటలు సాగు చేసేలా రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఆత్మ కమిటీ పాలకమండలి, వ్యవసాయ శాఖ అధికారులు రైతులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే మంచి ఫలితాలను పొందవచ్చని ఎమ్మెల్యే సూచించారు.