కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ పట్టణంలో మే 3 నుంచి 10 వరకు సంపూర్ణ లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ రూబినా నజీబ్ పేర్కొన్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో వైస్ ఛైర్మన్ ఆహిర్ పరశురామ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. 8 రోజుల పాటు లాక్డౌన్ నిర్వహించాలని తీర్మానించారు.
అత్యవసర సరుకులు కూరగాయలు, పండ్లు, కిరాణా దుకాణాలు, మాంసం దుకాణాలు, ఫర్టిలైజర్ షాపులు ఉదయం 11 గంటల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. మెడికల్ షాపులు, పాల దుకాణాలకు మినహాయింపు ఇచ్చారు. 4, 11 తేదీల్లో జరిగే స్థానిక కూరగాయల మార్కెట్‌ను రద్దు చేశారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా ఉన్నా, అధిక ధరలకు విక్రయాలు జరిపినా రూ.10 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించేలా సర్కారు అడుగులు