సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా బాధితులకు వైద్యసేవలు ప్రారంభమైనట్లు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆక్సిజన్ సదుపాయం గల 70 పడకలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఆస్పత్రిలోని కొవిడ్ వార్డుని పరిశీలించి, వైద్య సేవలపై ఆరా తీశారు. ఆక్సిజన్ కొరత లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని హామీ ఇచ్చారు. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆస్పత్రి ప్రాంగణంలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడంతో పాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. నాణ్యమైన వైద్యంతో పాటు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ వసుంధర, వైద్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'అద్దెలు పెరిగింది హైదరాబాద్లో మాత్రమే!'