CI Helping on Orphan Childerns: ఆయన పోలీస్‌శాఖలో ఓ ఉద్యోగి. చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలో చదువు మానేసిన విద్యార్థులను చేరదీసి.. తిరిగి వారిని పాఠశాలలో చేర్పిస్తున్నారు. అంతేకాక వారి విద్యకు అయ్యే ఖర్చును భరిస్తున్నారు. ఇందుకు కోసం వన్‌ఛాలెంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. దాతల సహాయంతో వివిధ సామాజిక సేవలు చేపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురానికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్న చిన్నారులంటే చాలా ఇష్టం. స్వగ్రామానికి చెందిన ఆఫ్రిన్‌కు రెండేళ్లుగా విద్యకు అయ్యే ఖర్చులు భరిస్తున్నారు. అలాగే పటాన్‌చెరు జడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న వంశీకృష్ణ అనే విద్యార్ధి తండ్రి చనిపోవడం.. తల్లి అనారోగ్యానికి గురి కావడంతో మధ్యలో చదువు మానేసి టీదుకాణంలో పనికి చేరాడు.
ఈ విషయం కాస్త సీఐ వేణుగోపాల్‌రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే వంశీకృష్ణను పాఠశాలలో చేర్పించడంతో పాటు.. వారి కుటుంబానికి ప్రతినెలా ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎంఎస్‌ఎన్ పరిశ్రమకు చెందిన కార్మికులు తమవంతు చేయూత ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. వారు ప్రతిసంవత్సరం వినాయకుడిని ఏర్పాటు చేసి లడ్డూను వేలం వేస్తారు.
వేలంలో వచ్చిన నగదును ఏదైనా మంచిపనికి వినియోగిస్తారు. ఇందులో భాగంగానే సీఐ వేణుగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్చంద సంస్థకు రూ.2.1 లక్షలు అందజేశారు. ఈ నగదును ముకుందాపురంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన ఐదుగురు బాలికలకు అందించారు. ఇదేకాక సీఐ వేణుగోపాల్‌రెడ్డి తన సొంత గ్రామం ముకుందాపురంలోనూ పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
జడ్పీ ఉన్నత పాఠశాలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సీఐ వేణుగోపాల్‌రెడ్డి నిధులు సమకూర్చారు. విద్యార్థులు కూర్చునేందుకు బెంచీలు, బల్లలు వంటి సామాగ్రిని అందించారు. ఇవేకాక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కొందరు వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారు. ఆయన చేస్తున్న సేవలను స్పూర్తిగా తీసుకొని వ్యాపారవేత్త సాయికృష్ణ నలుగురి చిన్నారులకు రూ.2.4 లక్షలు.. మరో బాలికకు రూ.10,000 ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావడం విశేషం.
"ముకుందాపురం, పరిసరప్రాంతంలోని మూడు కుటుంబాలకు మా మిత్రులు, దాతల సహాయంతో ఆర్థిక సహాయం అందచేశాం. దీనితోపాటు మరికొందరు దాతలు సహాయం చేసేందుకు ముందుకువచ్చారు." -వేణుగోపాల్‌రెడ్డి, సీఐ
ఇవీ చదవండి: విద్యార్థి జీవితంలో వెలుగులు నింపిన పటాన్‌చెరు సీఐ
BJP Booth Committees: 'బూత్ కమిటీలు పూర్తయితేనే మీ రాజకీయ భవిష్యత్ బాగుంటుంది'