Amit Shah Telangana Tour Today: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. నేడు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నేరుగా చేవెళ్లకు 6 గంటలకు చేరుకుంటారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
రాత్రి 7 గంటలకు సభ ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో కర్ణాటకకు పయనమవుతారు. విజయ సంకల్ప సభకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర రాజకీయం వేడెక్కిన తరుణంలో అమిత్ షా పర్యటన మరింత వేడి రాజేస్తోందని.. రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు : తెలంగాణ రాష్ట్రానికి చేవెళ్ల గడ్డ సెంటిమెంట్ అని.. అందుకే బీజేపీ మొదటి విజయ సంకల్ప సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సభ కోసం 12 కమిటీలను ఏర్పాటు చేశామని.. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 2,789 పోలింగ్ బూత్ల నుంచి కార్యకర్తలు, కమిటీ సభ్యులు సభకు హాజరవుతారని పేర్కొన్నారు. సభకు వచ్చేవారికి బీరు, బిర్యానీ, డబ్బులు ఇస్తలేమని.. పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా లక్ష మంది హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు: చేవెళ్ల బహిరంగ సభకు 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరువలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో నగరం నుంచి సైతం కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న క్రమంలో భారీ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అమిత్‌షా శంషాబాద్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో చేవెళ్లకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పలు మార్గాల్లో ఆంక్షలు విధించారు. అదే విధంగా సభా స్థలి వద్ద కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం నాలుగు చోట్ల ఏర్పాట్లు చేశారు.
ఇవీ చదవండి: