National Lok Adalat: జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులతో పాటు రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
రాజీకీ వీలున్న క్రిమినల్ కేసుల్లోని కక్షిదారులు భవిష్యత్తులో ప్రశాంత జీవనం కోసం తమ కేసుల పరిష్కారానికి ముందుకు రావాలన్నారు. రాజీ పడాలనుకునే వారు తమ కేసులున్న న్యాయస్థానాల దృష్టికి తమ న్యాయవాదులు ద్వారా, లేదా నేరుగా తీసుకెళ్లాలన్నారు. పెండింగులో ఉన్న కేసులే కాకుండా ఇతర ప్రీలిటిగేషన్ కేసులను కూడా ఈ జాతీయ లోక్ అదాలత్‌లో పరిష్కరించనున్నట్టు తెలిపారు.
వివాహ కుటుంబ తగాదా కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్‌బౌన్స్ తదితర కేసులకు లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్నా జిల్లా న్యాయస్థానం, తాలుకా న్యాయస్థానాల్లోని న్యాయసేవాధికార సంస్థల సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఉచితంగా సలహాలు ఇస్తారని శ్రీదేవి తెలిపారు.
ఇదీ చదవండి: Revanth visits martyrs stupa: 'సచివాలయం మీదున్న శ్రద్ధ.. అమరవీరుల స్తూపంపై లేదు'