లాక్‌డౌన్ సడలింపు నేపథ్యంలో ప్రభుత్వ సూచనల ప్రకారం అర్బన్ ప్రాంతాల్లో సరి, బేసి విధానంలో దుకాణాలు తీయాలి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని పెద్దగా పాటించడం లేదు. శంకర్‌పల్లిలో దుకాణాలకు చీటీలు అందించి, ఒకరోజు సరి, మరో రోజు బేసి సంఖ్య ఉన్న దుకాణాలు తెరిపిస్తున్నారు. చేవెళ్లలో అన్ని రకాల దుకాణాలు తీస్తున్నారు. బయటకు వచ్చే ప్రతి ఒక్కరికి మాస్కులు తప్పనిసరి చేశారు. కంటెయిన్‌మెంట్ జోన్ల పరంగా మేడ్చల్ జిల్లాలో ఒక్కటీ లేదు.. రంగారెడ్డిలో జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి షాహీన్‌నగర్‌లో కొనసాగుతుండగా.. హయత్‌నగర్ మునగనూరులో ఆంక్షలు సడలించారు.
భవన నిర్మాణాల్లో పురోగతి...
లాక్‌డౌన్ కారణంగా గ్రామాల్లో భవన నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఆ రంగంలో ప్రధానంగా ఇళ్ల నిర్మాణాల్లో ప్రస్తుతం కదలిక వచ్చింది. నిర్మాణ సామగ్రికి అవసరమైన దుకాణాలు తెరిచి ఉండటం వల్ల పనుల్లో వేగం పుంజుకోనుంది. వలస కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోవడం, గ్రామాల్లోని వారు ఉపాధి పనులవైపు మొగ్గు చూపుతుండటంతో కూలీలు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని నిర్మాణదారులు చెబుతున్నారు.
పరిశ్రమల్లో ముమ్మరంగా కార్యకలాపాలు...
శివారుల్లోని పరిశ్రమల కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. రెండు జిల్లాల పరిధిలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, భారీ, అతిభారీ పరిశ్రమలను తెరిచేందుకు అధికారులు అనుమతించారు. అతిభారీ పరిశ్రమలు పూర్తిగా తెరుచుకోగా.. కార్మికుల కొరత, మార్కెట్ లేకపోవడం వల్ల మిగిలినవి అంతంతమాత్రంగా పునఃప్రారంభించారు.
వనస్థలిపురంలో పాజిటివ్ కేసుల తీవ్రత దృష్ట్యా.. సమీపంలోని ఆటోనగర్‌లో దుకాణాలు తెరిచేందుకు పోలీసులు అనుమతించలేదు. రంగారెడ్డి జిల్లాలో ఆరు విభాగాల్లో కలిపి మొత్తం 3,450 పరిశ్రమలు ఉండగా.. 1,615 మాత్రమే తెరిచారు. మేడ్చల్ జిల్లాలోని 3600 పరిశ్రమల్లో 2800 వరకు గాడిలో పడ్డాయి.
‘లాక్‌డౌన్ కారణంగా నగరంలో దుకాణాలు తెరుచుకోవడం లేదు. శివారుల్లో ఉన్న పరిశ్రమలు చాలావరకు నగర మార్కెట్‌పై ఆధారపడి ఉన్నాయి. దీనివల్ల పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించేందుకు కొంత సమయం పడుతుంది’ అని రంగారెడ్డి జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.
మాస్కులు ధరించాలి.. ఎడం పాటించాలి...
లాక్‌డౌన్ అమలులో సడలింపులు ఇస్తున్నా కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలి. మాస్కులు ధరించడం, ఎడం పాటించడం నిత్య జీవితంలో భాగం కావాలి. నిబంధనలను భారంగా కాకుండా బాధ్యతగా భావించాలి. మాస్కులు లేకుండా రహదారులపైకి వస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తాం. దుకాణాల వద్ద వ్యక్తిగత దూరం పాటించకపోతే సీజ్ చేస్తాం.
- అమోయ్ కుమార్, కలెక్టర్, రంగారెడ్డి జిల్లా