విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘మహా జన గర్జన’ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలోని 84 వెనుకబడిన కులాలకు సీఎం కేసీఆర్ 90 ఎకరాలు కేటాయించారని, తాజాగా విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనానికి ఉప్పల్ భగాయత్‌లో 5 ఎకరాల భూమి, రూ.5 కోట్లు మంజూరు చేశారని ఆయన(Minister Gangula) పేర్కొన్నారు. అంతకుముందు విశ్వకర్మ చిత్రపటం వద్ద మంత్రి పూజలు చేశారు. ఆచార్య జయశంకర్, వీరన్న, శ్రీకాంతాచారిలకు నివాళులు అర్పించారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రూ.250 కోట్లు కేటాయించి కార్పొరేషన్ ద్వారా యంత్రాలు ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి విజ్ఞప్తి చేశారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఎమ్మెల్సీ చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు, యంత్రాలు, ముడిసరుకు అందజేయాలని శంకరమ్మ కోరారు.
ఈ కార్యక్రమంలో వివిధ పీఠాల ప్రతినిధులు చంద్రమౌళీశ్వరస్వామి, వీరధర్మజస్వామి, సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాగారం కవితారాణి, మహిళా ప్రధాన కార్యదర్శి శ్యామల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చెన్నయ్యచారి, ఎన్.సంతోష్‌చారి, రవీంద్రచారి తదితరులు పాల్గొన్నారు.