గడ్డి అన్నారం మార్కెట్ తాత్కాలిక నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో దసరా నుంచి కొనుగోళ్లు జరుగుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. అదే రోజున కోహెడలో వర్తకులకు ఇచ్చే స్థలాల్లో నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు కొత్తపేటలోని విక్టోరియా హోమ్ స్థలాన్ని మంత్రులు నిరంజన్ రెడ్డి, మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. కొత్తపేట విక్టోరియా హోమ్ స్థలంలోని మైదానాన్ని పరిశీలించిన మంత్రులను కమీషన్ ఏజెంట్లు తమ ఇబ్బందులను వివరించారు.
కోహెడలో మౌలికసదుపాయాలు కల్పించే వరకు బాటసింగారంలో కొనసాగిస్తామని ఇప్పటికే ప్రతిపాదించారు. అయితే తాత్కాలికంగా మార్కెట్ నిర్వహణకు బాటసింగారానికి బదులుగా కొత్తపేటలోని విక్టోరియా మెమోరియల్ - వీఎంహోం ప్లేగ్రౌండ్‌లో కొనసాగించాలని మజ్లిస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దీంతో తాత్కాలిక పండ్ల మార్కెట్ కోసం విక్టోరియా ప్లే గ్రౌండ్‌తో పాటు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్క్ రెండు స్థలాలను పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ మార్కెట్‌ను పరిశీలించారు.
బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో దసరా నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. దసరా రోజునే కోహెడలో నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతాం. అటు వర్తకులతో, వ్యాపారులతో మాట్లాడి... అక్కడికి వెళ్లి చూశాకే నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం ఉద్దేశాన్ని, సంకల్పాన్ని ఎంఐఎం కూడా అంగీకరించింది. గడ్డి అన్నారంలో త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కేసీఆర్ ప్రారంభిస్తారు. కోహెడకు వెళ్లే లోపల బాటసింగరంలో వసతులేమి లేకుండా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేం చర్యలు తీసుకుంటాం. సజావుగా వర్తకం నడిచేలా చూస్తాం. పండ్ల వ్యాపారులకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది.
- మంత్రి నిరంజన్‌రెడ్డి
ఇదీ చూడండి: Gaddiannaram Fruit Market: దశాబ్దాల గడ్డి అన్నారం మార్కెట్ చరిత్రకు తెర