రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దావూద్‌గూడ తండాలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత పల్లె ప్రగతిలో తమ దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు దాదాపు పూర్తి అయ్యాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామానికి ఇప్పటి వరకు రూ.27 లక్షల పైచిలుకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. రైతుబంధు కింద రూ.66 లక్షలకు పైగా నిధులు రాగా, ముగ్గురికి రైతు బీమా కింద రూ.15 లక్షలు అందాయని గుర్తు చేశారు. ఈ ఘనత అంత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ క్రమంలోనే గ్రామాల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని మంత్రి కోరారు. దేశంలోనే తెలంగాణ పల్లెలు నేడు టాప్-20లో 19 వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా 12 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు. గ్రామంలో పాఠశాల, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కరెంట్ సమస్యలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందని మంత్రి కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయలేని భాజపా నేతలు.. మన ప్రాంతానికి వచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామ సభ అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్లె నిద్రలో భాగంగా బస చేశారు. అంతకుముందు సర్పంచ్ విజయరాజు నేతృత్వంలో బంజారా మహిళలు తమ సాంప్రదాయ నృత్యంతో మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.
ఇదీ చూడండి..
రాష్ట్ర సర్కారుపై సుప్రీం ఆగ్రహం.. ఆ కేసులో జరిమానా చెల్లించనందుకే!
చేతిపై రేపిస్ట్ పేరు రాసుకుని బాలిక ఆత్మహత్య.. రెండేళ్లుగా మౌనంగా ఏడుస్తూ...