రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రభావం ఖజానాపై కొనసాగుతూనే ఉంది. మే నెల రాష్ట్ర రాబడుల్లో సగమే వచ్చాయి. లాక్‌డౌన్ నిబంధనలు సడలించి మూడువారాలు గడిచినా రాబడులు ఏప్రిల్ కంటే కొంత పెరిగాయే తప్ప అంచనాల కంటే తక్కువే ఉన్నాయి. జీఎస్టీతో పాటు, మద్యం విక్రయాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రాబడి అంచనాలను చేరుకోలేదు. మేలో వాణిజ్య పన్నుల శాఖకు రూ. 1,560 కోట్లు వచ్చింది. ఏప్రిల్ కంటే సుమారు రూ. 600 కోట్లు పెరిగినా అంచనాల్లో సగమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల ద్వారా రూ. 4000 కోట్లు రుణంగా తీసుకుంది. సాధారణ సమయంలో రాష్ట్రానికి సొంత రాబడులు ద్వారా రూ. 5,500 కోట్లు వస్తాయనేది అంచనా కాగా లాక్‌డౌన్ వల్ల అది రూ. 2,000 కోట్లకే పరిమితమైంది. జూన్‌లో పరిస్థితి ఆశాజనకంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
కేంద్రం నుంచి పన్నుల వాటానే
రాష్ట్రానికి పన్నుల వాటాగా కేంద్రం ఏప్రిల్‌లో రూ. 982 కోట్లు ఇచ్చింది. మేలో రూ. 1,195 కోట్లు వస్తుందని అంచనా వేయగా ఈసారీ రూ. 982 కోట్లే వచ్చింది. జీఎస్టీ పరిహారంగా ఏప్రిల్‌లో రూ. 200 కోట్లు అందగా మేలో అదీ అందలేదు. ఏప్రిల్‌లో విపత్తుల నిర్వహణ నిధి నుంచి రాష్ట్రానికి రూ. 450 కోట్లు అందింది. కేంద్ర పథకాల ద్వారా మేలో మరో రూ. 350 కోట్లు వచ్చాయి.