ప్రజల సమస్యలను తీర్చడమే తన ప్రధాన ధ్యేయమని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికార పార్టీలో చేరిన అనంతరం వారిని పట్టించుకోకుండా మోసం చేశారని రంగారెడ్డి జిల్లా భాజాపా అధ్యక్షుడు సామ రంగారెడ్డి విమర్శించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు గడుస్తున్నా.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ లింగోజిగూడ డివిజన్లోని పలు కాలనీల్లో కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు.
ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ప్రజల పరిస్థితి ఏమాత్రం మారకపోగా.. అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం అభివృద్ధి చెందారని భాజపా నేతలు విమర్శించారు. లింగోజిగూడ డివిజన్‌కు జరగబోయే కార్పొరేటర్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరెటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పనిచేసే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే: కేటీఆర్