KTR Visit Obulapuram Jatara: రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపురంలో సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహిస్తున్నారు. ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు మంత్రి కేటీఆర్. ఓబులాపురంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరకు ఆయన వెళ్లారు. అక్కడ అమ్మవార్లను దర్శించుకున్న కేటీఆర్... వనదేవతలకు (బెల్లం) బంగారం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు.

ఓబులాపురం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చిన భక్తులను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా పలకరించారు. జాతరలో కనిపించిన కేటీఆర్‌ను చూసి యువత సెల్ఫీలు దిగేందుకు యువత పోటీపడ్డారు. కేటీఆర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు భక్తులు ఉత్సాహం చూపారు. జాతరకు వచ్చిన భక్తులతో సరదాగా కేటీఆర్ సంభాషించారు. ఓ భక్తురాలు కేటీఆర్‌ను ఆప్యాయంగా కౌగిలించుకుంది. జాతర ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆయన ఆదేశించారు.
సిరిసిల్ల జిల్లాలో పర్యటన...
సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో రైతు వేదికను ప్రారంభించారు. దేశానికి అన్నదాతల శక్తి చాటేందుకే రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 603 రైతు వేదికలు నిర్మాణం చేసి అన్నదాతలకు మేలు జరిగేలా చర్యలు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు అందేలా రైతు వేదికలు మేలు చేస్తాయన్నారు.
ఇదీ చూడండి: KTR Baddena Tour: 'దేశానికి అన్నదాతల శక్తి చాటేందుకే రైతు వేదికలు'