తెలంగాణ సంస్కృతి.. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఆడపడుచులకు చీరలను(Bathukamma sarees) కానుకగా ఇస్తోంది. తమ ఆర్థిక స్తోమత వల్ల పండుగకు కొత్త బట్టలు కొనుక్కోలేని పేద ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసే ఈ చీరలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముస్తాబవుతున్నాయి. బతుకమ్మ పండుగకు తీరొక్క పువ్వుతో గౌరమ్మను అలంకరించినట్లే.. బతుకమ్మ ఆడటానికి వెళ్లే మహిళలు.. తీరొక్క రంగు చీరల్లో అందంగా ముస్తాబవ్వడానికి.. ఏకంగా 26 రకాల డిజైన్లతో బతుకమ్మ చీరలు(Bathukamma sarees) తయారుచేస్తున్నారు. 816 రంగుల్లో సిరిసిల్ల నేతన్నలు వీటికి పురుడుపోస్తున్నారు.
14వేల మరమగ్గాలకు ఆర్డర్లు..
కార్మికుల నైపుణ్యాలను వెలికితీసి.. నూతన ఉత్పత్తులను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నాలుగేళ్లుగా బతుకమ్మ చీరల(Bathukamma sarees) ఆర్డర్లు సిరిసిల్ల మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమకు కేటాయిస్తోంది. ఈ ఏడాది జనవరిలోనే రాష్ట్ర చేనేత, జౌళిశాఖ.. జిల్లాలోని మ్యాక్స్ సంఘాలు, ఎన్ఎస్ఇ యూనిట్ల పరిధిలోని పద్నాలుగు వేల మరమగ్గాలకు ఆర్డర్లు ఇచ్చారు.
7 కోట్ల మీటర్ల వస్త్రం..
కొత్తగా ఎంపిక చేసిన డిజైన్లు.. డాబీ, జకార్ట్ అమర్చిన మరమగ్గాల పైనే ఉత్పత్తి చేయాలి. యంత్రాలకు అదనపు పరికరాల కొనుగోలు.. వాటి అమరికకు రెండు నెలల సమయం పట్టింది. వీటి తర్వాత డిజైన్ల పెంపు కారణంగా కార్మికులు కూలీ ధర పెంచాలని సమ్మెకు దిగారు. ఇలా ముందుగా ఆర్డర్లు ఇచ్చినా పూర్తిస్థాయి ఉత్పత్తి ప్రారంభమయ్యేసరికి మూడు నెలలు ఆలస్యమైంది. ఏడు కోట్ల మీటర్ల ఉత్పత్తి లక్ష్యంలో ఆగస్టు నెలాఖరు నాటికి టెస్కో మూడుకోట్ల తొభై లక్షల మీటర్ల వస్త్రం సేకరించింది. కోటి మీటర్లు సేకరణ దశలో ఉంది. మిగిలిన రెండు కోట్ల మీటర్ల పైచిలుకు వస్త్రం ఈ నెల పదిహేనులోపు పూర్తి చేయాలి.
"2017 నుంచి బతుకమ్మ చీరలు తయారు చేస్తున్నాం. 2021లో చీరల బార్డర్లో డిజైన్లు ఉండాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. వాటి కోసం మాకు కొత్త మరమగ్గాలు ఇచ్చారు. ప్రభుత్వం సూచించిన డిజైన్లే కాకుండా.. మేం సరికొత్తగా డిజైన్లు తయారు చేస్తున్నాం. సర్కారే కాకుండా.. ప్రైవేట్ సంస్థలు కూడా మాకు ఆర్డర్లు ఇస్తే బాగుంటుంది."
- చేనేత కార్మికుడు
" బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కానుకగా ఇవ్వడానికి చీరల కోసం 7 కోట్ల మీటర్ల వస్త్రం ఆర్డర్‌ను సిరిసిల్లకు ఇచ్చారు. ఇప్పటి వరకు 4 కోట్ల ఉత్పత్తి జరిగింది. మిగిలింది సెప్టెంబర్ 15 వరకు ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది."
- సాగర్, ఏడీ, జిల్లా చేనేత, జౌళిశాఖ
త్వరలోనే జిల్లాలకు..
చీరల ఉత్పత్తి లక్ష్యం నిర్ణీత సమయంలోగా పూర్తి చేసేందుకు సిరిసిల్లలోని పద్నాలుగు వేల మరమగ్గాలతో పాటు వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల టెక్స్ టైల్ పార్కులోని పరిశ్రమలకు 98 లక్షల మీటర్ల ఆర్డర్లు ఇచ్చారు. జులై మొదటి వారం నుంచే టెస్కో.. ఉత్పత్తి అయిన చీరలను సేకరిస్తోంది. వీటిని హైదరాబాద్, సిరిసిల్లలోని పద్నాలుగు ప్రాసెసింగ్ యూనిట్లకు పంపుతున్నారు. అక్కడ సైజింగ్, ప్యాకింగ్ ప్రక్రియ జరుగుతోంది. వీటిని తర్వాత నేరుగా జిల్లాలకు పంపించనున్నారు.
బతుకమ్మ చీరల ఉత్పత్తిలో ప్రతి ఏటా నూతన డిజైన్లను తీసుకొస్తున్నారు. దీనికి పరిశ్రమలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి డాబీ, జకాట్ అమర్చడం వల్ల ఒక్కో మరమగ్గంపై యజమానులు, ఆసాములు 18వేల నుంచి 25వేలు అదనంగా ఖర్చు చేశారు. ఆధునికీకరించిన మరమగ్గాలకు ప్రోత్సాహకంగా అదనపు మీటర్ల వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇవ్వాలనే ప్రభుత్వ ప్రణాళికలేవి కార్యరూపం దాల్చలేదు. కార్మికులకు కరోనా కష్టకాలంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు కొంతమేరకు ఊరటనిచ్చాయి. కానీ 2019 నుంచి ప్రభుత్వం నూలు రాయితీని విడుదల చేయాలనే డిమాండ్ ఉంది.