వినూత్న పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తూ నికర ఆదాయం పాటిస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన రైతులు. ఒకరేమో హరిత పందిళ్ల కింద, మరొకరు బిందు సేద్యం, ఇంకొకరు మచ్లింగ్ లాంటి విధానాలు పాటిస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నారు. సాగులో.. ఆధునిక విధానాలతో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న వారిపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.
రూ.2 లక్షల వరకు రాబడి..
తొగర్రాయికి చెందిన కోట రాజమల్లారెడ్డి, వీణ దంపతులు.. ఉద్యానశాఖ నుంచి రాయితీపై విత్తనాలు, పనిముట్లు సమకూర్చుకున్నారు. రెండు ఎకరాల్లో మచ్లింగ్ పద్ధతిలో కాకర, సోర, బీర తదితర తీగజాతి పంటలు పండిస్తున్నారు. మొక్కలకు మచ్లింగ్ పద్ధతి, బిందుసేద్యం ద్వారా నీరు, సేంద్రియ ఎరువులు అందిస్తున్నారు. మార్కెట్లో కూరగాయల టోకు ధర కిలో రూ.30 వరకు ఉండటంతో ఈ సీజన్‌లో రూ. 2లక్షల వరకు లాభాలు గడించినట్లు వారు చెబుతున్నారు.
హరిత పందిళ్లతో నికర ఆదాయం..
గట్టెపల్లికి చెందిన తేలుకుంట సుగుణాకర్, రాజు పలు ప్రాంతాల్లో పాటిస్తున్న హరిత పందిరి విధానాన్ని గమనించారు. తమకున్న రెండెకరాల పొలంలో ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై.. హరిత పందిళ్లు, తీగల పందిళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో బీర సాగు చేసి వారానికి రూ.5 వేల వరకు ఆదాయం గడిస్తున్నారు. గతేడాది టమాట, మిర్చి, క్యాప్సికమ్, వివిధ రకాల పూల తోటలు సాగు చేసి ఇలాగే లాభాలు గడించామని వారు తెలిపారు.
పభుత్వం ప్రోత్సహించాలి..
మార్కెట్లో కూరగాయల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయి. ఉద్యాన శాఖ అధికారులు పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. రాయితీపై విత్తనాలు సరఫరా చేసి కూరగాయలు, వాణిజ్య పంటలను ప్రోత్సహించాలి.
- వీణ, తొగర్రాయి.
మాతో పాటు అయిదుగురికి ఉపాధి...
ఉద్యాన శాఖ అందించిన రాయితీతో రెండు ఎకరాల్లో హరిత పందిళ్లు, తీగల పందిళ్లు ఏర్పాటు చేశాం. ఇందులో బీర, సోర, టమాట, క్యాప్సికమ్ వంటి కూరగాయ పంటలు పండించాం. ఖర్చులు పోను వారానికి రూ.5 వేలు లభిస్తున్నాయి. మాతోపాటు అయిదుగురు కూలీలకు నిత్యం ఉపాధి లభిస్తోంది.
- సుగుణాకర్, గట్టెపల్లి.