లాక్డౌన్ సడలింపు సమయంలోనే ప్రజలు అన్ని పనులు చేసుకోవాలని రామగుండం సీపీ సత్యనారాయణ సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో రాత్రి ఆకస్మికంగా పర్యటించి లాక్డౌన్ అమలు తీరును పరిశీలించారు.
రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వారికి కరోనా రాపిడ్ టెస్టులు చేయించారు. సుమారు 15 మందికి టెస్ట్లు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో... రాత్రిపూట బయటికి రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారిపై లాఠీ ఝుళిపించారు. ఇప్పటివరకు రామగుండం కమిషనరేట్ పరిధిలో 6 వేల వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. 40 వేల కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
కమిషనరేట్ పరిధిలో కరోనా పాజిటివ్ రేటు 50శాతం నుండి 4 శాతంకు తగ్గిందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్య శాఖతో సమన్వయంగా పోలీసులు నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 19 వరకు కఠినంగా లాక్డౌన్ను అమలు చేస్తామని... ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని సూచించారు.
ఇదీ చదవండి: CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ