Sri Ramsagar Project Gates Opened : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా మారింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు అధికారులు ఎత్తారు. ప్రాజెక్టులోని 18 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అయితే ప్రాజెక్టులో 1091 పూర్తీ స్థాయి నీటిమట్టానికి గాను.. ప్రస్తుతం 1087 అడుగుల నీరు ఉంది. 88,827 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 73.547 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
Nizamabad projects water Levels : కామారెడ్డి జిల్లాలో ఉన్న నిజాంసాగర్, జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ సింగూరు నుంచి వరద భారీగా రావడంతో దాదాపుగా నిండిపోయింది. ఎగువ నుంచి 7,200 క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 14.464 టీఎంసీలు నీరు ఉంది. జుక్కల్ మండలం కౌలాస్ నాలా ప్రాజెక్టులోకి ఎగువ కర్ణాటక నుంచి 855 క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా.. ప్రస్తుతం 457.45 మీటర్లు ఉంది. జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, బిచ్కుంద, పిట్లం, మండలాల్లో చెరువులు, కుంటలు నిండిపోయాయి. పలు గ్రామాల వాగులు పొంగడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
Nizamabad projects in Rain : మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, అంతేగాక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దీంతో కామారెడ్డి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా వర్షం కురవడంతో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు రైతులు వ్యవసాయ పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉండే పరిస్థితి నెలకొంది. భారీ వర్షానికి కామారెడ్డి నియోజకవర్గంలో పలు మండలాలలో మక్క, సోయా, పత్తి పంటలు నీట మునిగాయి. భీమేశ్వర వాగు, నల్లమడుగు మత్తడి వాగు, పాల్వంచ వాగు, ఎడ్లకట్ట వాగు, కామారెడ్డి చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. వర్షంధాటికి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీ, రుక్మిణికుంట, పంచాముఖి హనుమాన్ కాలనీ, అయ్యప్ప నగర్ కాలనీ, నిజాంసాగర్ రోడ్డు పూర్తిగా జలమయ్యాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. వాహనదారులకు ఇబ్బందులు : నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి, ఇంధల్వాయి, డిచ్పల్లి, మోపాల్, ధర్పల్లి, సిరికొండ, నిజామాబాద్ గ్రామీణ మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, ఒర్రెలు ఉపొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండలా తలపిస్తూ అలుగు పోస్తున్నాయి. నిజామాబాద్-హైదరాబాద్ ప్రధాన రహదారి నడిపల్లి వద్ద రోడ్డుపై వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని 59 చెరువులు పూర్తిగా నిండి పోయాయి గుండె, పులాంగ్ వాగులకు ఉ ప్పొంగి ప్రవహిస్తున్నాయి.
ఇంధల్వాయి మండలంలోని ఇంధల్వాయి, గన్నారం, చంద్రయాన్ పల్లి, సిర్ణపల్లి, నల్లవెల్లి చెరువులు అలుగు పోస్తున్నాయి. అలాగే లింగాపూర్ వాగుకు వరద పోటెత్తుతుంది. ధర్పల్లి మండలంలోని చిన్న మధ్యతరహా ప్రాజెక్ట్ అయిన రామడుగు ప్రాజెక్ట్ నిండి 15 వందల క్యూసెట్ల ఔట్ ఫ్లో ఉంది. మండలంలోని సీతాయి పెట్, మైలవరం, వాడి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలంలోని బొడ్డు మామిడి చెర్వు, కప్పల వాగు ఉప్పొంగి ప్రవహించడంతో సిరికొండ, చీమన్ పల్లి, గడ్కోల్, భీంగల్ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జక్రాన్పల్లి మండలంలోని పడకల్, జక్రాన్పల్లి చెరువులు అలుగు పారుతున్నాయి.
ఇవీ చదవండి: