Power Problems: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత ఐదు రోజులుగా వ్యవసాయానికి రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపివేశారు. ఉత్పత్తి తగ్గడం, సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే పగటి పూట మాత్రమే సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ రైతులు మాత్రం పంట చేతికందే దశలో కరెంటు కష్టాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని వాపోతున్నారు. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు కొందరు జనరేటర్ల సాయంతో మోటర్లు నడుపుతున్నారు. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డి పల్లి, లోలం, అన్సన్‌పల్లి, ధర్పల్లి మండలంలోని మద్దులతాండ, వాడి, హొన్నజీ పేట్, సిరికొండ మండలంలోని ముషీర్ నగర్, రావుట్ల గ్రామాల్లో వరి పంటలు ఎండిపోగా పశువులను మేపుతున్నారు.
కరెంట్ ఈ 7 సంవత్సరాల నుంచి బాగానే ఉంది. కానీ ఇప్పుడు సమస్యగా మారింది. విద్యుత్ నిలిపివేస్తుండటంతో జనరేటర్‌ను తీసుకువస్తున్నా. 18 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశాను. ధాన్యం చేతికొచ్చేవరకు ఓ 10 నుంచి 15 రోజులు కరెంట్ మంచిగా ఇస్తే బాగుండేది కదా. రోజుకు 7 నుంచి 8 గంటల కరెంట్ ఇస్తున్నరు. నోటి దగ్గరకు వచ్చిన పంటలు ఎండిపోతున్నయి. -రైతు
నీరు పుష్కలంగా ఉన్నా.. విద్యుత్ సరఫరాలో అంతరాయానికి ముందే ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దాదాపు 20 ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి అధికారులే కారణమని కర్షకులు ఆరోపించారు. 15 రోజుల క్రితం భూగర్భ జలాలు అడుగంటాయని తెలిపారు. కనీసం రెండు తడులకు చెరువు నీరు ఇవ్వాలని తహసీల్దార్‌ను వేడుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. చెరువులో నీరు పుష్కలంగా ఉన్న ఆయకట్టు పొలాలు ఎండిపోయాయని వాపోయారు.
ఆందోళనలో అన్నదాతలు.. సాధారణంగా వరి పంటలో చివరి దశలో నీటి తడులు చాలా కీలకం. పంటకాలంలో చివరి తడులు దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. విద్యుత్ కోతలు మరో వారం రోజుల పాటు కొనసాగినా తమకు తీవ్ర నష్టాలు తప్పవని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: