టీపీసీసీ(tpcc) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) వ్యాఖ్యలపై భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) తీవ్రంగా మండిపడ్డారు. వ్యక్తిగత, పార్టీ సంబంధిత ఒత్తిళ్లతో రేవంత్ రెడ్డి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్‌లో బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు భాజపాలో(bjp) చేరారు. వారికి కండువా కప్పి అర్వింద్ పార్టీలోకి ఆహ్వానించారు.
అభ్యర్థులే లేరు
కాంగ్రెస్(congress party) పార్టీకి కార్యకర్తలు లేరని.. వచ్చే ఎన్నికల్లో కనీసం అభ్యర్థులు దొరకని దుస్థితి ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు లేరని.. పోటీ చేసినా డిపాజిట్ ఓట్లలో సగం కూడా రావన్నారు. డీ.సంజయ్‌తో తనకు ఎంటువంటి సంబంధమూ లేదని..... అతని వ్యాఖ్యలకు స్పందించబోనని అర్వింద్ స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి చాలా కామెంట్లు చేస్తున్నారు. ఆయనకు చాలా ఒత్తిడి ఉంది. ఒక దిక్కు ఈడీ, ఇంకోదిక్కు ఏసీబీ మూడోదిక్కు కాంగ్రెస్ పార్టీ. ఏదో ఒకటి, రెండు సభలకు పైసలిచ్చి జనాన్ని తోలుకొస్తారు. డి.సంజయ్ అనేక మాటలు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ ప్రపంచంలో ఆయనతోటి ఎటువంటి బంధుత్వం లేదు. ఆయన వ్యాఖ్యలపై నేను స్పందించను.
-ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ
భాజపా నేతల ఆగ్రహం
ఎంపీ అర్వింద్‌పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిజామాబాద్ జిల్లా భాజపా నాయకులు ఖండించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు రేవంత్ తీరును తప్పుపట్టారు. పీసీసీ అధ్యక్ష పదవి రాగానే.. అనుచిత భాష వాడటం సరికాదన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు.
రేవంత్ ఏంటో అందరికీ తెలుసు
వ్యక్తిగా రేవంత్ రెడ్డి ఏంటో అందరికీ తెలుసునని.. ఓటుకు నోటు కేసు, ఇతర కేసులు ఏమున్నాయో ప్రజలకు తెలుసని భాజపా నేతలు అన్నారు. తెలుగు దేశం వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు. ఇతరులను విమర్శించే ముందు తన స్థాయి ఏంటో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు.
ఈ సమావేశంలో భాజపా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, నేతలు మల్యాద్రి రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డి, వినయ్ రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, లక్ష్మినారాయణ, నిజామాబాద్ నగర పాలక సంస్థ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: