Babli Project Gates Lifted : గోదావరిపై మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరుచుకున్నాయి. కేంద్ర జలవనరుల సంఘం నియమించిన పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు గేట్లు తెరిచారు. బాబ్లీ నుంచి దిగువకు వచ్చిన ప్రవాహంతో నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి జలకళను సంతరించుకుంది.
సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఉమ్మడి రాష్ట్రాల నీటిపారుదల, కేంద్ర జల సంఘం అధికారుల నేతృత్వంలో బాబ్లీ గేట్లు ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏటా జులై 1 నుంచి అక్టోబరు 28 వరకు బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని వదులుతారు. ఈ జలాలతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగు నీరందుతుంది. నదీ జలాలు దిగువకు వదులుతున్నందున తీర ప్రాంతాల రైతులు, మత్య్సకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.