Revanth Reddy Assurance on Nirmal Master Plan Issue : రాష్ట్ర శాసనసభ సమరంలో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు(Public Meeting) ఆయన హాజరై ప్రసంగించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే జిల్లాలోని మాస్టర్ ప్లాన్(పట్టణ బృహత్ ప్రణాళిక) రద్దు చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని రేవంత్ హామీ ఇచ్చారు.
Revanth Reddy Fires on KCR : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కమీషన్లకు కక్కుర్తిపడి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాలో సాగునీరు ఇచ్చేందుకు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును(Pranahitha Chevella Lift Irrigation) కాంగ్రెస్ చేపట్టిందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. ఆదిలాబాద్‌కు సాగునీరు వచ్చేదని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే.. తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు పూర్తయ్యేది కానీ తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు కడితే కమీషన్లు రావని కేసీఆర్ భావించారని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాల జోరు - గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు
రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు ఖర్చు రూ.లక్షన్నర కోట్లకు పెంచి భారీగా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో 25 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయన్న రేవంత్.. పేదలకు రెండు పడక గదుల ఇళ్లు కట్టించి ఇస్తానని అందమైన కలలు చూపించారని బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. ఈ పదేళ్లలో ఎంతమందికి రెండు పడక గదుల ఇళ్లు(Double Bed Room) ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని తెలుపుతూ.. రెండు పడక గదుల ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే కేసీఆర్ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు.
ఇవాళ తెలంగాణ మొత్తం ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్యం బతికే పరిస్థితి లేదు. కొందరు దొరల చేతిలో ఆధిపత్యం నడుస్తోంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన చేవెళ్ల ప్రాజెక్టును.. పేరు మార్చి కాళేశ్వరంగా మేడిగడ్డకు తరలించారు. రూ.38500 కోట్లతో కట్టాల్సిన ప్రాజెక్టును రూ.లక్షా యాభై వేల కోట్ల అంచనాకు పెంచి.. మొత్తం ధనాన్ని దోపీడీ చేశారు. మేడిగడ్డలో కట్టిన బ్యారేజ్ కుంగింది. అన్నారం పగిలిపోయింది. - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే - ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా : రేవంత్‌రెడ్డి
సొంత జిల్లాలోనే ఇళ్లు నిర్మించని ఇంద్రకరణ్ రెడ్డి.. రాష్ట్రంలో ఇచ్చారంటే నమ్ముతారా అంటూ రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతకు తీరని అన్యాయం చేసిన పార్టీ.. బీఆర్ఎస్(BRS Party) అని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తమ ప్రభుత్వానిదని రేవంత్ హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని సాగనంపితేనే పేదలకు మళ్లీ మేలు జరుగుతుందని అన్నారు. దొరల పాలనకు, ప్రజల తెలంగాణకు మధ్య పోరాటం జరుగుతోందని రేవంత్ స్పష్టం చేశారు.