నిర్మల్ జిల్లాలో పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం పల్లె ప్రగతి నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మండల, గ్రామాల వారీగా నిర్మాణంలో ఉన్న పనుల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.
శ్మాశాన వాటికలు, షెడ్లు, రైతు వేదికల నిర్మాణ పనులను అధికారులు ప్రజా ప్రతినిధుల సమన్వయంతో వెంటనే పూర్తి చేయాలని కోరారు. కూలీల సంఖ్యను పెంచి వెంటనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు వేదిక ప్రాంగణంలో పచ్చదనం పెంపొందేలా మొక్కలు నాటాలన్నారు. జోహార్ పూర్, జౌల, నిర్మల్, చించోలి, బైంసా మండలం చూచుంద్లలో రైతు వేదికల నిర్మాణ పనులనూ వేగవంతం చేయాలని సూచించారు.
ప్రతి రోజు నిర్మాణ పనులు జరిగేలా సంబంధిత శాఖల అధికారులు పనుల పురోగతిని ప్రతిరోజు పర్యవేక్షించాలని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈఓ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : 'మా భూమిని అధికార పార్టీ నేతలు కాజేశారు'