నిర్మల్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 27 , 28 కాలువల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందిస్తామని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 28 ద్వారా భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కులను అందజేశారు.
తానూర్ మండలానికి చెందిన 113 మంది రైతులకు మొత్తం 8 కోట్ల 12లక్షల 40 వేల 250 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. ప్యాకేజీ 27, 28 పనులు పూర్తయితే నిర్మల్ జిల్లాలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు.
కాంట్రార్ల వల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందని, సాధ్యమైనంత త్వరగా కాలువల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. మరోవైపు కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. రైతులకు చేయూత ఇవ్వడంలో సీఎం కేసీఆర్ వెనుకంజ వేయటం లేదని, పేదలను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని వివరించారు.