నిర్మల్ జిల్లా సోన్ మండలంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. మండల కేంద్రంలో రూ.22 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రైతు వేదిక నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే వ్యవసాయం రంగంలో తెలంగాణ అనూహ్యమైన అభివృద్దిని సాధించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, ముందు చూపుతోనే అది సాధ్యపడిందన్నారు. సమైక్య రాష్ట్రంలో వెనుకబడ్డ వ్యవసాయం రంగం స్వరాష్ట్రంలో నేడు పునరుత్తేజం పొందిందని తెలిపారు.
అన్నదాతలను ఆదుకునే దిశగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తోందని, దీని వల్ల సుమారు రూ.7 వేల కోట్లకు పైగా సబ్సిడీ భారం పడుతున్నప్పటికీ రైతన్నల మేలు కోరి ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో రైతులు పండించిన పంటలను ఆఖరి గింజ వరకు ప్రభుత్వమే గిట్టుబాటు ధర చెల్లించి మరీ కొనుగోలు చేసిందన్నారు. రైతుల సంక్షేమం కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నామని, రైతులు పరస్పరం చర్చించుకోవడానికి, వ్యవసాయాధికారులతో సమావేశం కావడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడాతాయన్నారు.
అనంతరం లక్ష్మణచాంద మండలం వడ్యాల్ గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి నర్మదా ముత్యం రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మహబూబాబాద్ జిల్లా చీకటాయపాలెంలో రోడ్డు ప్రమాదం