ఆశ్చర్యం.. ఆసక్తికరం..
ఈ ముగ్గరు మౌనికలవి.. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలంలోని హాద్గాం, లోకేశ్వరం, రాజురా గ్రామాలు. ఒకే మండలానికి చెందిన వారు కావడంతో ముగ్గురు కూడా పదోతరగతి వరకు లోకేశ్వరంలోని శారదా విద్యామందిరంలో(2012-13)నే చదివారు. తర్వాత అగ్రికల్చరల్ డిప్లొమో 2014లో పూర్తి చేశారు. 2017లో రాష్ట్ర సర్కరు.. వ్యవసాయ రంగంలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడంతో ముగ్గురూ దరఖాస్తు చేసుకున్నారు. ముగ్గురూ.. మండల వ్యవసాయ విస్తర్ణాధికారులు(ఏఈఓ)గా ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ముగ్గురికీ సొంత మండలమైన లోకేశ్వరంలోనే కొలువులు కేటాయించడంతో.. ఇప్పుడు కూడా ఒకే కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వారు ముగ్గురి పేరు ఒకటే కావడం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒకే పేరు.. ఒకే పాఠశాల.. ఒకే కొలువు.. ఒకే కార్యాలయంలో విధులు.. ఇలా వినే వారిలో కొందరికి వింతగానూ.. మరికొందరికి ఆసక్తికరంగానూ.. ఇంకొందరికి విడ్డూరంగానూ అనిపిస్తోంది.
కొందరు కన్ఫ్యూజ్ అయ్యేవారు..
ముగ్గురు ఒకే ఆఫీస్లో పనిచేయటం ఆనందంగా ఉందని కుంట మౌనిక తెలిపారు. చదువుకున్న పాఠశాల పక్కనే కార్యాలయం ఉండటం ఇంకా సంతోషంగా ఉందన్నారు. మొదట్లో తమ పేర్లు చూసి గందరగోళానికి గురయ్యేవారని.. మరి కొందరు ఆశ్చర్యపోయేవారిని వివరించారు.
"నా పేరు కుంటా మౌనిక. లోకేశ్వరం మండలంలో ఏఈవో(లోకేశ్వరం క్లస్టర్)గా విధులు నిర్వర్తిస్తున్నా. నాతో పాటు మరో ఇద్దరు ఏఈవోల పేర్లు కూడా మౌనికనే. వాళ్లు నేను ఒకటే స్కూల్లో చదువుకున్నాం. పదో తరగతి పూర్తి కాగానే డిప్లొమా చేసి.. ఇప్పుడు ఒకే మండలంలో విధులు నిర్వర్తించడం చాలా సంతోషంగా ఉంది. మా పేర్లు చూసి మొదట్లో అందరూ ఆశ్చర్యపోయేవారు. మేం చదువుకున్న స్కూల్ పక్కనే.. ఆఫీస్ ఉంది. అది ఇంకా సంతోషంగా ఉంది. మేం ముగ్గురం కొన్ని సందర్భాల్లో కలిసి వెళ్లినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది." - కుంట మౌనిక, లోకేశ్వరం క్లస్టర్
ఇవన్నీ అనుకోకుండా జరిగిపోయాయి..
"నేను గడ్చందా క్లస్టర్లో ఏఈవోగా విధులు నిర్వహిస్తున్నా. నాతో పాటు నా స్నేహితుల పేర్లు కూడా మౌనికనే. వాళ్లు వేరే క్లస్టర్లో విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురం ఒకే స్కూల్లో చదువుకొని.. ఇపుడు ఉద్యోగం వచ్చిన తరువాత కూడా ఒకే కార్యాలయంలో విధులు నిర్వర్తించటం చాలా సంతోషంగా ఉంది. కొన్ని సందర్భాల్లో అధికారులు.. మా ఇంటి పేరు లేదా క్లస్టర్ పేరు పెట్టి పిలిస్తేనే తెలిసేది. ఇదంతా అనుకోకుండానే జరిగిపోయింది." -మోరే మౌనిక, గడ్చందా క్లస్టర్
ఉపాధ్యాయులు కలుస్తూ..
"నేను పుస్బూర్ క్లస్టర్లో విధులు నిర్వర్తిస్తున్నా. మా ముగ్గురికి అనుకోకుండానే ఒకే దగ్గర పోస్టింగులు వచ్చాయి. పాఠశాల పక్కనే కార్యాలయం ఉండటంతో.. అప్పుడప్పుడు మా ఉపాధ్యాయులు కలుస్తూ ఉంటారు. మాలో మరింత స్ఫూర్తిని కలిగిస్తారు. వాళ్లను కలవటం చాలా సంతోషంగా ఉంటుంది. రైతులు బాగా ఆదరిస్తున్నారు." -సిబ్బుల మౌనిక, పుస్బూర్ క్లస్టర్
ఇదీ చూడండి: