'ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం' అనే అంశంపై నిర్మల్లోని పురపాలక సంఘ కార్యాలయంలో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. ఈ సదస్సులో నిర్మల్ జిల్లా పాలనాధికారి ప్రశాంతి మాట్లాడుతూ... ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రతి ఉద్యోగి తమ వెంట ఓ జూట్ బ్యాగ్, స్టీల్ టీ కప్పును తీసుకెళ్లాలని సూచించారు . మార్పు మొదట మనతోనే మొదలవ్వాలని, ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ నిబంధనలు మొదట నిర్మల్ జిల్లాతోనే ప్రారంభమవ్వాలని, ఇవి ఇతరులకు స్ఫూర్తిగా మారాలని అన్నారు. రేపటి నుంచి నిత్యావసర సరుకుల కోసం ప్లాస్టిక్కు బదులుగా ప్రత్యామ్నాయ సంచులను వాడాలన్నారు . రానున్న రోజుల్లో వ్యాపారస్తులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత ప్లాస్టిక్ వాడకంపై జరిమానాలు సైతం విధిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప పాలనాధికారి భాస్కరరావు, మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వెంకటేశ్వర్లుతో పాటు పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ సంచులకి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వమే సమకూర్చాలని అభిప్రాయపడ్డారు స్వచ్ఛంద సంస్థల సభ్యులు.
ఇవీచూడండి : ఇప్పపువ్వు కోసం గిరిజనుల ధర్నా