దిశ హత్యకేసులో నిందితులను పోలీసులు పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్ చేశారని రాష్ట్ర పౌరహక్కుల సంఘం ఆరోపించింది. జాతీయ మానవ హక్కుల కమిషన్... ఎన్కౌంటర్కు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్, గుడిగండ్ల గ్రామాల్లో నిందితుల కుటుంబ సభ్యులను కలుసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులు చేసింది నేరమే అయినా... న్యాయ ప్రక్రియ ద్వారా శిక్షిస్తే బాగుండేదని... పోలీసులు ఎన్కౌంటర్లో కాల్చి చంపడం సబబు కాదని కుటుంబ సభ్యులు అభిప్రాయపడ్డారు.
దిశ హత్యాచార ఘటనను మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించిందని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరిందని సంఘం సభ్యులు గుర్తు చేశారు. దిశ తండ్రి కూడా తక్షణ దండన కోరాడే తప్ప... ఇలా ఎన్కౌంటర్లో చంపమని కోరలేదని అన్నారు. నిందితులు పరుగెత్తే స్థితిలో లేరని, తుపాకీ సైతం కాల్చలేరని కుటుంబ సభ్యులు చెప్పినట్లు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన తీరు చూస్తే.. ఏం జరిగిందో ఎవరికైనా అర్ధమవుతుందని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం పోలీసులకు లేదన్నారు.
ఎన్కౌంటర్ల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలను ఈ కేసు విషయంలోనూ అమలు చేయాలని పౌర హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వంపై ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక ఇలా ఎన్ కౌంటర్ల చేయడం సరైన విధానం కాదని మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం నేతలు రఘునాథ్, నారాయణరావు, పురుషోత్తం, కుమార స్వామి, రవీందర్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు .
ఇవీ చూడండి: మెజిస్ట్రేట్‌లపై ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రశ్నల వర్షం