మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో వారం రోజుల్లో మొత్తం 500 ఆక్సిజన్ సదుపాయం గల పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. త్వరలో నారాయణపేట జిల్లా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కొవిడ్ నివారణ, లాక్‌డౌన్‌పై మహబూబ్‌నగర్, నారాయణపేట కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
నారాయణపేట జిల్లాలో 64 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని, ప్రస్తుతం 42మంది రోగులు ఉండగా, రోజూ పది మందికి పైగా వస్తున్నారని, ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు కావాలని కలెక్టర్ హరిచందన... మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. కొవిడ్ బాధితుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రిని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన మంత్రి మహబూబ్ నగర్ జిల్లా మెడికల్ కళాశాల నుంచి జనరల్ మెడిసిన్ డాక్టర్‌ను నారాయణపేట జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నారాయణపేటకు పది ఆక్సిజన్ సిలిండర్లు పంపాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. జిల్లా ఆస్పత్రిలో 100 పడకలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ రెండు జిల్లాల్లో రెమిడెసివర్ ఇంజక్షన్లకు ఎలాంటి కొరత లేదని... సుమారు 3వేల ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మహబూబ్‌నగర్ పట్టణంలో ఏనుగొండ, వీరన్న పేట, పాత పాలమూరు, టీడీ గుట్టలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నూతనంగా నియమించుకున్న 12 మంది డాక్టర్లతో పట్టణంలో పలు ప్రాంతాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దేవరకద్ర, కోయల్‌కొండ, బాలనగర్లో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఆక్సిజన్, మందులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ, కలెక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు, నారాయణపేట కలెక్టర్ హరిచందన, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్‌నగర్ ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, నారాయణపేట ఎస్పీ చేతన పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వరుసగా రెండోరోజు తగ్గిన యాక్టివ్ కేసులు