దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో అనివార్యమైన నాగార్జునసాగర్ ఉపఎన్నిక.. ఆద్యంతం హోరాహోరీగా సాగింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని తెరాస, పూర్వవైభవాన్ని చాటుకోవాలని కాంగ్రెస్, సత్తాచాటాలనే కసితో భాజపా... సాగర్ బరిలో దిగాయి. అన్ని పార్టీల ముఖ్యనేతలు... ఓటర్లను ఆకట్టుకునేందుకు క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమించారు. హోరాహోరీగా సాగిన సమరంలో.. దివంగత నేత నోముల నర్సింహయ్య మరణం తాలుకూ సానుభూతి, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభిపృద్ధి కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ వ్యూహాలతో.... నాగార్జునసాగర్‌లో తెరాస మళ్లీ గులాబీ జెండా ఎగురవేసింది.
18 వేల 82 ఓట్ల తేడాతో విజయం
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో.... తొలిరౌండ్ నుంచే తెరాస అభ్యర్థి నోముల భగత్ స్పష్టమైన ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. 9 రౌండ్ల వరకూ 8 వేల 139 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. ఐతే పదో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి... 175 ఓట్ల స్వల్ప అధిక్యం లభించింది. మళ్లీ పుంజుకున్న తెరాస.... 11వ రౌండ్ నుంచి తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించింది. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 18 వేల 82 ఓట్ల తేడాతో విజయ సాధించారు.
డిపాజిట్ కోల్పోయిన భాజపా
సాగర్ ఉపఎన్నికలో తెరాసకు 89 వేల 804 ఓట్లు వచ్చాయి. 70 వేల 932 ఓట్ల సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి..... రెండోస్థానంలో నిలిచారు. 7 వేల 676 ఓట్లతో... భాజపా అభ్యర్థి రవికుమార్ మూడోస్థానంతో సరిపెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. తెదేపా సహా మిగతా పార్టీలు.... నామమాత్రంగానే మిగిలిపోయాయి. సాగర్‌లో విజయాన్ని అందించిన ఓటర్లకు... తెరాస అభ్యర్థి నోముల భగత్ కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి నోముల నర్సింహయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని...... సీఎం కేసీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్‌లో విజయంతో తెరాస శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. తెలంగాణభవన్ వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్.. మిఠాయిలు పంచారు. కార్యకర్తలు టపాసులు కాల్చి... ఆనందోత్సాహాల్లో మునిగితేలారు.
ఇదీ చదవండి: సవాళ్లే 'విజయ'న్ సోపానాలు