నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో పోటీకి తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థిగా నోముల భగత్‌కుమార్‌కు టికెట్ ఇవ్వాలని అధిష్ఠానం యోచిస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఇతర నేతలు కోటిరెడ్డి, గురవయ్యయాదవ్, రంజిత్‌యాదవ్, బాలరాజ్‌యాదవ్ తదితరులు కూడా టికెట్ ఆశిస్తున్నారు. వీరందరి పేర్లను సీఎం పరిశీలించి, సర్వేలు చేయించారు.
నల్గొండ జిల్లా పార్టీ నేతలతో పాటు ఇన్‌ఛార్జులు, ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. పార్టీ శ్రేణుల మనోభావాలకు తోడు నోముల నర్సింహయ్య పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఆయన వారసునికి అవకాశం ఇవ్వడం మేలని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. ఎంపికైన అభ్యర్థి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- ఇదీ చదవండి : 'జానారెడ్డి గెలుపు.. రాష్ట్ర రాజకీయాల్లో మలుపు'