మహబూబ్‌నగర్ జిల్లాలో అంతర్భాగంగా ఉండి... ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్న పట్టణం నాగర్‌కర్నూల్. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న నాగర్‌కర్నూల్‌ను...2011లో నగర పంచాయతీగా మార్చారు. గతంలో 20 వార్డులుండగా... ప్రస్తుతం ఇవి 24కు పెరిగాయి. నాగర్‌కర్నూల్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పారిశుద్ధ్యం. భూగర్భ మురుగు కాలువలను ఏర్పాటు చేస్తున్నా... ఆ పనులు పూర్తి కాకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. కొత్తగా ఏర్పడిన కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగునీటి సరఫరా వ్యవస్థ అందుబాటులో లేవు. సిబ్బంది కొరత కారణంగా... ఇంటింటికీ చెత్తసేకరణ కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది.
స్వాగతం పలుకుతున్న సమస్యలు
పలుకాలనీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్లు తవ్వి... పూర్తిస్థాయిలో పూడ్చకపోవడంతో అవి అధ్వాన్నంగా తయారయ్యాయి. బస్టాండ్, ప్రభుత్వాసుపత్రితో పాటు పలు కాలనీల్లో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి. మురికి గుంటలు ఉండడంతో దోమలు, ఈగలు చేరి... పట్టణవాసులు రోగాల బారిన పడుతున్నారు. రోడ్లపైనే మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్ నడుస్తోంది. పట్టణవాసులు సేదతీరేందుకు మినీ ట్యాంక్‌బండ్ నిర్మించినా... ప్రత్యేకంగా ఎలాంటి పార్కులు అందుబాటులో లేవు. జిల్లాగా మారిన తర్వాత ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. సిగ్నల్‌వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఈ సమస్యను అధిగమించే అవకాశముందని పట్టణవాసులు అంటున్నారు.
కుంటుపడిన కొల్లాపూర్ అభివృద్ధి
నాగర్‌కర్నూల్ జిల్లాలోని మరో మున్సిపాలిటీ కొల్లాపూర్. పురపాలక ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కొల్లాపూర్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ 20వార్డులుండగా...పాలకవర్గం లేక కొల్లాపూర్ అభివృద్ధి కుంటుపడింది. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాగునీరు. మిషన్ భగీరథ నీళ్లు అన్ని ప్రాంతాలకు అందడం లేదు. వచ్చే నీరు కూడా పరిశుభ్రంగా వస్తోంది. కొల్లాపూర్ పట్టణంలో మినహా విలీన గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగుకాలువల వ్యవస్థ లేదు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. రహదారి పక్కన ఫుట్‌పాత్ నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కూరగాయలు, మాంసం, చేపల విక్రయం కోసం ప్రత్యేకంగా మార్కెట్ లేకపోవడంతో... ప్రధాన రహదారిపైనే సంత జరుగుతోంది. ఇక్కడ మొదటిసారి ఎన్నికలు జరుగుతుండడంతో... అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
కల్వకుర్తి కనిపించని మౌళిక వసతులు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని మరో పురపాలక సంఘం కల్వకుర్తి. గతంలో 20 వార్డులుగా ఉన్న పట్టణాన్ని ప్రస్తుతం 22గా పునర్విభజించారు. ప్రధానంగా విలీన గ్రామాల్లో మౌలిక వసతులు లేక పట్టణవాసులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మురుగు కాలువల నిర్మాణం, నిర్వాహణ సరిగ్గా లేక చెత్త చెదారం పేరుకుపోతోంది. ఏళ్లు గడిచినా తాగునీటి సమస్య తీరడం లేదు. చాలా ప్రాంతాల్లో ఇంకా సీసీ రోడ్లు నిర్మించలేదు. విద్యుత్ లైన్ల ఆధునీకీకరణ, విద్యుద్దీపాల ఏర్పాటు అసంపూర్తిగానే ఉంది. ఇంటింటికీ చెత్త సేకరణ జరగకపోవడమే కాకుండా... డంపింగ్ యార్డు అందుబాటులో లేదు. కొన్ని కాలనీల్లో రోడ్ల సౌకర్యం లేక వర్షకాలంలో పట్టణవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమనగల్లు
కల్వకుర్తి నియోజకవర్గంలోని మరో మున్సిపాలిటీ ఆమనగల్లు. 15 వార్డులు ఉన్న ఆమనగల్లు పురపాలకలో మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ సమస్యలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. మున్సిపాలిటీగా మారినప్పటికీ... పంచాయతీ సిబ్బందే అన్ని పనులు చేస్తున్నారు. ఇంఛార్జి కమిషనర్ పాలనలో ఉండగా అభివృద్ధి పనులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, విద్యుత్ వ్యవస్థ వంటి సమస్యలతో పట్టణవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలతో విసిగిపోయిన ప్రజలు... పార్టీలకతీతంగా స్థానిక సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చిన నాయకులనే ఎన్నుకోవాలనే భావిస్తున్నారు.
ఇవీ చూడండి: నేటితో ముగియనున్న పురఎన్నికల నామినేషన్ల ప్రక్రియ