దేవాలయాల వద్ద టోల్ వసూలు చేయొద్దంటూ భాజపా, కాంగ్రెస్ నాయకులు ఆందోళన నిర్వహించారు. నల్లమలలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రాలైన మద్దిమడుగు హనుమాన్ దేవాలయం, ఉమామహేశ్వర ఆలయం వద్ద అక్రమ వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద భాజపా, ఫారెస్ట్ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించాయి. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పుణ్య క్షేత్రాలకు వెళ్ళే భక్తుల వద్ద ద్విచక్రవాహనానికి రూ.30, త్రిచక్ర వాహనానికి రూ.50, నాలుగు చక్రాల వాహనానికి రూ.60, పెద్ద వాహనాలకు రూ.100 అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
అనధికార టోల్ గేట్లను ఎత్తి వేసి అక్రమ వసూళ్లను ఆపాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. ఎప్పుడులేని టోల్ రుసుం ఇప్పుడేందుకని మాజీ ఎమ్యెల్యే, డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ అధికారులను ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి నల్లమల్లలోని ఆలయాల వద్ద రెండు టోల్ గేట్లను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. దూర ప్రాంత భక్తులకు టోల్ డబ్బులు చెల్లించడం భారంగా మారిందని, దేవుని పేరుతో చేస్తున్న వ్యాపారాన్ని ఆపాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.