నల్లమల అడవుల్లో రెండు మూడ్రోజులకోసారి జరుగుతున్న అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు నుంచి శ్రీశైలం వరకూ విస్తరించిన అడవుల్లో ఏదో మూల అడవి కాలుతూ దర్శనమిస్తోంది. ఆకురాలే కాలం, సుమారు ఐదడుగుల ఎత్తులో.. అడవంతా.. విస్తరించి ఉన్న ఎండు గడ్డి.. కాస్త నిప్పు రవ్వ తగిలితే చాలు.. ఎకరాలెకరాలు అంటుకుపోతున్నాయి. ఆ మంటల్ని ఆర్పడానికి అటవీశాఖ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు.
నల్లబడుతున్న నల్లమల
దోమల పెంట రేంజ్ పరిధిలో ఇటీవలే ఆరుసార్లు అటవీ ప్రాంతం తగలబడింది. గడ్డి కాలిపోవడమే కాదు.. ఎండిపోయిన చెట్లు సైతం మంటల్లో తగలబడి పోతున్నాయి. చాలా చోట్ల నల్లమల అడవి నల్లబడి కనిపిస్తూ ఉంది. రోడ్డుకు అనుకుని ఉన్న ప్రాంతాల్లోనే కాదు.. కొండలు, లోయల నడుమ సైతం అప్పడప్పుడు గుప్పుమంటున్న పొగ అటవీశాఖ సిబ్బందిని పరుగులు పెట్టిస్తోంది.
అదే కారణమా?
నల్లమల అటవీ ప్రాంతం నుంచి పాదయాత్రన వెళ్లే భక్తులు, పర్యటకులు, యాత్రికులే ఈ అగ్నిప్రమాదాలకు కారణమని అటవీశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. వంట కోసమో, సిగరెట్ కోసమో నిప్పటించి.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు ప్రపంచానికి ఆవేదన మిగిల్చింది. ఇప్పుడు నల్లమలలో తరచూ జరిగే అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈత కొమ్మలే గతి!
బేస్ క్యాంపుల్లో ఉన్న వాచర్లతో పాటు.. తక్షణ స్పందన బృందాల పేరిట ప్రత్యేకంగా దోమలపెంట, మన్ననూరు, అమ్రాబాద్ రేంజ్ల పరిధిలో ప్రత్యేకంగా వాచర్లను నియమించారు. మంటలను ఆర్పేందుకు బ్లోయర్ల లాంటి పరికరాలున్నా... నల్లమలలో మాత్రం పచ్చి ఈత కొమ్మలను వినియోగిస్తుంటారు. మంటల తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఈత కొమ్మలు పనిచేయవు. మంటలు కాస్త తగ్గుముఖం పట్టాక మాత్రమే.. వాటిని అదుపు చేసేందుకూ ఈత కొమ్మల్ని వాడతారు. అగ్నిమాపక వాహనాలున్నా రహదారికి సమీపంలో చెలరేగే మంటలు మాత్రమే ఆర్పగలవు. అడవి లోపల మంటలు ఆర్పాలంటే సిబ్బందికి ఈత కొమ్మలే గతి.
అవగాహన
వరుస ప్రమాదాల నేపథ్యంలో అటవీలోకి నిప్పుకి సంబంధించిన ఎలాంటి వస్తువులను అధికారులు అనుమతించడం లేదు. కాలినడకన అడవిని దాటే మార్గాలను సైతం మూసేశారు. జనంలో అవగాహన పెంచేందుకు చాలా చోట్ల బ్యానర్లు, ప్రకటనలు ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాల సమాచారం ఉపగ్రహాల ద్వారా ఎప్పటికప్పుడు చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
పునరావృతమైతే కష్టమే
ఇటీవల నల్లమలలో జరిగిన అగ్ని ప్రమాదాల కారణంగా అటవీ జంతువులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నా... నల్లమలకే ప్రత్యేకమైన వృక్షజాతులు, జంతు జాతులకు నష్టం వాటిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడ్డే ఆహారంగా బతికే మూగజీవాలు, వాటిని వేటాడి జీవించే మాంసాహార జంతువులు సైతం ప్రమాదాల కారణంగా ఆహారం కోసం ఇబ్బంది పడే అవకాశాలున్నాయి.
- ఇదీ చూడండి : తెలంగాణలో 91,295 ఎకరాల అడవి దగ్ధం