హైదరాబాద్ వంటి నగరాల్లో మొక్కల పెంపకానికి సరిపడా స్థలం లేదని చింతించే వారికోసం.. వివిధ పనులతో మొక్కలను సంరక్షించుకోలేకపోతున్న వారికి సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొన్నారు హితమ్ ఇంజినీరింగ్ విద్యార్థులు.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన 21 ఏళ్ల మాజీద్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతూ.. హైడ్రోఫోనిక్స్ ఫార్మింగ్‌పై దృష్టి సారించాడు. తన ముగ్గురు మిత్రులతో కలిసి.. అర్బన్ ఏరియాలో ఈ టెక్నాలజీ ద్వారా మొక్కల పెంపకం చేపట్టాడు. దీనికి ఐవోటి సాంకేతికతను జతచేసి.. వాటర్ పోరింగ్, మాయిశ్చర్, హ్యుమిడిటి ఆధారంగా వాటర్ పోరింగ్ సాంకేతికతను అభివృద్ధి చేశారు. చరవాణి ఆధారంగానూ నిర్వహించే సాంకేతికతతో నీటి వృథాను అరికట్టవచ్చని పేర్కొన్నారు.
నాగర్ కర్నూల్ బిజినపల్లికి చెందిన సంతోశ్.. ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. డిప్లొమా నుంచే డ్రోన్ల మీద ఆసక్తితో.. తోటి మిత్రులతో కలిసి ఓ స్టార్టప్ ఏర్పాటు చేశాడు. స్వతహాగా పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉన్న సంతోశ్‌కు అక్కడి సమస్యలు, సవాళ్లకు పరిష్కార మార్గంగా.. డ్రోన్లను ఉపయోగించాలని భావించాడు. మొదట్లో పురుగు మందు పిచికారీ కోసం డ్రోన్లను వినియోగించాడు. అద్దె ప్రాతిపదికన చుట్టుపక్క సుమారు 1500 పొలాలకు డ్రోన్ల ద్వారా పిచికారీ చేసేవాడు.
కొవిడ్-19 వ్యాప్తి నివారణకు సోడియం హైపోక్లోరేట్ ద్రావణం పిచికారీకి స్థానిక యంత్రాంగం సంతోశ్ బృందంతో ఒప్పందం చేసుకొంది. ఇదే స్ఫూర్తితో మహబూబ్‌నగర్ కలెక్టర్ విజ్ఞప్తి మేరకు.. హరితహారం కార్యక్రమంలో భాగంగా అటవీ ప్రదేశాల్లో సీడ్ బాల్స్ వేసేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. మహబూబ్‌నగర్ సహా, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలకు ఆలివ్ డ్రోన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ సేవలు విస్తరించాడు.
ప్రతి వ్యక్తిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని.. అందుకు ఒక వేదిక, అవకాశం కల్పిస్తే.. సంబంధిత రంగాల్లో సత్తా చాటుతారని జిల్లా సైన్స్ అధికారి గాంధారి ప్రభాకర్ అన్నారు. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రభాకర్ అన్నారు.