నాగర్‌కర్నూల్‌లోని ఎస్బీఐలో కరోనా కలకలం రేపింది. దీంతో తాత్కాలికంగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు సేవలను మూసివేశారు. వనపర్తి ఎస్బీఐ శాఖలో విధులు నిర్వహిస్తున్న అధికారికి బుధవారం కరోనా పాజిటివ్ అని తేలిందని ఎస్బీఐ మేనేజర్ రామలింగేశ్వరరావు తెలిపారు. ఆ అధికారి ఇటీవలే నాగర్‌కర్నూల్ శాఖలో ఆడిట్ నిర్వహణలో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించారని చెప్పారు. దీంతో బ్యాంకు శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
అతడి నుంచి ఎవరికైనా ప్రైమరీ కాంటాక్ట్స్ ఏవైనా జరిగి ఉండవచ్చనే అనుమానంతో మెయిన్ బ్రాంచ్ ఆదేశాల మేరకు బ్యాంకు సిబ్బంది సేవలను తాత్కాలికంగా మూసివేశారు. పాజిటివ్ ఉన్న వ్యక్తి విధులు నిర్వహిస్తున్న వనపర్తి ఎస్బీఐ శాఖల్లోని రెండు బ్రాంచీలు, నాగర్‌కర్నూల్ బ్రాంచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. బ్యాంకులో ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు ఎలాంటివీ జరగడం లేదని... తిరిగి వైద్య శాఖ అధికారులు, తమ అధికారుల ఆదేశాల మేరకు బ్యాంకును తెరుస్తామని ఎస్బీఐ మేనేజర్ రామలింగేశ్వరరావు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేత..!