Tribal Womens Making Sanitary Napkins In Mulugu : వారంతా గిరిజన మహిళలు. అందరూ కూలీ పనులకు వెళ్లేవారే.. దొరికినప్పుడు పనులు చేసుకోవడం, లేదంటే ఇంటికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు వారంతా చిన్న తరహా పరిశ్రమ స్థాపించి ఉపాధి పొందుతున్నారు. విజయవంతంగా నడిపిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ములుగు జిల్లా జంగాలపల్లికి చెందిన నాయక్ పోడ్ సామాజిక వర్గానికి చెందిన గిరిజన మహిళలు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు.
2019లో ఏటూరు నాగారం ఐటీడీఏ సహకారంతో సంఘటితమైన మహిళ సభ్యులతో నిత్య సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిగ్రీ చదివిన శ్వేత, సిరివెన్నెల గ్రూప్ ముందుకు నడిపిస్తున్నారు. మహిళలకు ఉపయోగపడే శానిటరీ నాప్కిన్ల యూనిట్‌ను రూ.27 లక్షలతో ఏర్పాటు చేశారు. ఐటీడీఏ ద్వారా రూ.16 లక్షల రాయితీ పొందగా.. బ్యాంకు రుణం రూ.8 లక్షలు మంజూరైంది. మిగతా రెండున్న లక్షలు లబ్ధిదారుల వాటాగా సమకూర్చారు. యూనిట్‌కు సంబంధించిన యంత్రాలు, ముడిసరుకు తెప్పించుకున్నారు. ఏటూరునాగారంలో నెలరోజులు శానిటరీ నాప్కిన్ తయారీపై శిక్షణ తీసుకున్నారు.
Tribal Womens Making Sanitary Napkins : 2019 డిసెంబర్ 31 న 'గిరి' బ్రాండ్ పేరుతో శానిటరీ నాప్కిన్ల తయారీ చేపట్టి జీసీసీకి ఇచ్చేవారు. తొలినాళ్లలో కరోనా వల్ల పాఠశాలలకు సెలవులు రావడంతో ఆర్డర్లు ఆగిపోయాయి. ఐనా ఏమాత్రం వెనకడుగేయకుండా స్వయంగా ములుగు, ఏటూరునాగారం తదితర ప్రాంతాల్లోని కిరాణ దుకాణాలకు వెళ్లి మార్కెటింగ్ చేసుకున్నారు. అలా ఏడాదిపాటు కష్టపడి సంస్థను కష్టకాలంలో గట్టెక్కించారు. తర్వాత పాఠశాలలు తెరుచుకోగానే జీసీసీకి సరఫరా చేస్తున్నారు.
"ఐటీడీఏ తరఫున లోన్ తీసుకొని.. ఎనిమిది మంది సభ్యులం కలసి ఈ ప్రాజెక్టును నడిపిస్తున్నాం. ఇక్కడ తయారు చేసిన శానిటరీ నాప్కిన్లను జీసీసీ ఆఫీసులకు సరఫరా చేస్తున్నాం. అక్కడ నుంచి వారు గవర్నమెంట్ లేడీస్ హాస్టళ్లకు పంపిస్తున్నారు. ఇందులో వచ్చిన ఆదాయాన్ని ఎనిమిది మంది సభ్యులం తీసుకుంటాం. ఇంతకు ముందు కూలీ పనులకు వెళ్లేవాళ్లం.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల మంచిగా ఉంటున్నాం. ప్రభుత్వం ఆదుకొని.. మరిన్ని ఆర్డర్లు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం." - తయారీ దారులు
Tribal Womens Making Sanitary Napkins Called Giri : నెలకు 3 నుంచి 4 వేల శానిటరీ నాప్కిన్ల ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. రు తయారు చేసిన ప్యాకెట్లలలో 7 నాప్కిన్లు ఉంటాయి. జీసీసీకి ఒక్కో ప్యాకెట్‌ను రూ.34 చొప్పున విక్రయిస్తున్నామని వారు తెలిపారు. ఏడాదికి 35 వేల ప్యాకెట్లను తయారు చేసి.. ఏడాదికి దాదాపు రూ.12లక్షల విలువైన ఉత్పత్తి చేస్తున్నారు. బిల్లులు వచ్చిన తర్వాత మెటీరియల్, బ్యాంకు వాయిదా, ఇతర ఖర్చులు పోనూ మిగతా లాభాన్ని పంచుకుంటున్నారు. కావాల్సిన మెటీరియల్‌ను హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నారు. తయారీ, గ్రేడింగ్, ప్యాకింగ్ అంతా వారే చూసుకుంటారు. స్వయం ఉపాధి పొందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బయటి మార్కెటింగ్ కోసం ప్రభుత్వ సాయం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఇవీ చదవండి :