మన్యంలో కరోనా... చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. ములుగు జిల్లాలో రోజూ 40 నుంచి 50కి తక్కువ కాకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మార్చి నుంచి జూన్ వరకు పెద్దగా కేసులు నమోదు కాకున్నా.. జులై... ఆగస్టులో కేసుల సంఖ్య బాగా పెరిగింది. జిల్లాలోని వెంకటాపురం మండలం.... వీఆర్కే పురంలో... వారం రోజుల వ్యవధిలోనే 93 కేసులు నమోదైయ్యాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 101కి చేరింది.
గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన దశదిన కర్మ... సహపంక్తి భోజనాలు వైరస్ వ్యాప్తికి కారణమయ్యాయి. భోజనాలు వడ్డించిన వ్యక్తి నుంచి మిగిలిన వారికి వైరస్ సోకినట్లుగా వైద్యులు అనుమానిస్తున్నారు. ఆగస్టు 25న మొదటి పాజిటివ్ కేసు నమోదు కాగా... ప్రస్తుతం ఈ గ్రామంలో 101 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో మిగిలిన గ్రామస్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేసులు పెరగడం వల్ల.. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గ్రామాన్ని పూర్తిగా దిగ్భందనం చేశారు. ఎవరూ బయట తిరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వెంకటాపురం సీహెచ్‌సీ, ఎదిర పీహెచ్‌సీ పరిధికి చెందిన వైద్య సిబ్బందితో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి వైద్య శిబిరాన్ని నిర్వహించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మంగపేట మండలం కమలాపూర్లోనూ 79 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. గోవిందరావుపేట మండలం అమృతండాలో 32 కేసులు వచ్చాయి. తీజ్ పండుగ నిర్వహణతో ఇక్కడ కేసులు పెరిగాయని భావిస్తున్నారు. చల్వాయ్, ప్రస్రాల్లోనూ వందకుపైగా కేసులు నిర్ధరణ అయ్యాయి. వాజేడు మండలం పేరూరు పీహెచ్‌సీ పరిధిలో 58 కేసులు, వాజేడు పీహెచ్‌సీ పరిధిలో 46 కేసులు వెలుగుచూశాయి. విందులు, పెళ్లిళ్లు, ఇతరత్రా జరిగే వేడుకల్లో ఎక్కువగా పాల్గొనడం... అవగాహనా లేమితో కేసులు పెరుగుతున్నాయి.
ఇవీ చూడండి: ఆన్లైన్ విద్యతో.. గ్రామీణ ఇంటర్ విద్యార్థుల అవస్థలు