మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ఇంటిపై నయీమ్ గ్యాంగ్ పేరిట రాతలు వెలిశాయి. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. పోచారం మున్సిపల్ పరిధిలోని సంస్కృతి టౌన్‌షిప్‌లో నివాసం ఉంటున్న మేకల శ్రీధర్ అనే వ్యక్తికి ఘట్‌కేసర్ పట్టణంలోని బ్రూక్‌బాండ్ కాలనీలో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో శ్రీధర్ తల్లి పుష్పవతి నివాసం ఉంటోంది. ఈ క్రమంలోనే ఇంటి గోడలపై నయీం గ్యాంగ్ పేరిట రాతలు వెలిశాయి. 'నాట్ ఫర్ సేల్, అండర్ కోర్టు కేసు.. డబ్ల్యూపీ నెంబర్ 7620, నయీమ్ గ్యాంగ్' అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి గోడలపై రాతలు రాశారు.
గమనించిన పుష్పవతి తన కుమారుడికి సమాచారం అందించింది. ఘట్‌కేసర్ పోలీసులకు శ్రీధర్ ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తులతో తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎన్.చంద్రబాబు వెల్లడించారు.