రైతులు అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట్ మండలంలో.. వ్యవసాయదారుల సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గిడ్డంగులు, వాణిజ్య సముదాయ భవనానికి... మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం మూడు చింతలపల్లిలో రైతు వేదికను మంత్రులు ప్రారంభించారు.
శామీర్పేట్ వ్యవసాయదారుల సేవా సహకార సంఘం ఇతర సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. నాబార్డు నుంచి రుణం పొంది... రైతులకు అవసరమైన గిడ్డంగులు నిర్మించడం అభినందనీయమన్నారు. సంఘం అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఛైర్మన్ సుధాకర్ రెడ్డిని ప్రశంసించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో ఉందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మూడుచింతలపల్లిలో రైతు వేదిక నిర్మాణానికి సాయం చేసిన ముగ్గురు దాతలను మంత్రులు అభినందించారు. ఈ కార్యక్రంలో జడ్పీ ఛైర్మన్ శరత్ చంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మంథనిలో ఈటల.. ప్రొటోకాల్ పాటించలేదని శ్రీధర్ బాబు అలక..